|UTTAR PRADESH| టీనేజ్‌లో ఉన్న ఓ అమ్మాయి తనను కనిపెంచిన తల్లికి టీలో విషం కలిపి ఇచ్చింది. ఆసుపత్రి పాలైన తల్లి క్రమంగా కోలుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఒక యువకుడితో రిలేషన్షిప్ విషయంలో తల్లి మందలించడంతో కూతురు ఈ నిర్వాకానికి పాల్పడింది.
రంగంలోకి దిగిన పోలీసులు మైనర్ బాలికను జ్యువనైల్ హోమ్‌కు, ఆమెను ప్రలోభపెట్టిన యువకుడిని కటకటాల వెనక్కి పంపారు. ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలిలో ఉన్న గోండ్వారా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈనెల 5న కూతురు ఇచ్చిన ‘టీ’ తాగి 48 ఏళ్ల సంగీత తీవ్ర అనారోగ్యం పాలైంది. దీంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రిలో చేర్చారు. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న సంగీత పోలీసులకు ఫిర్యాదు చేసింది. 18 ఏళ్ల హిమాంస్ యాదవ్‌తో చనువుగా ఉండడంతో కూతుర్ని తాను మందలించానని, దీంతో తన కుమార్తె సాయంతో యాదవ్ తన ఆహారంలో ఏవో మత్తుపదార్ధాలు కలిపి ఇచ్చాడని ఆమె ఆరోపించింది. తన కుటుంబాన్ని చంపుతామని కూడా యాదవ్ బెదరించినట్టు ఆ ఫిర్యాదులో పేర్కొంది.
కాగా, సంగీత కుమార్తె పైన, యాదవ్‌పైన ఐపీసీలోని సెక్షన్ 328 కింద కేసు నమోదు చేసినట్టు స్టేషన్ హౌస్ ఆఫీసర్ జేపీ సింగ్ తెలిపారు. అమ్మాయిని జువనైల్ హైస్‌కు, యాదవ్‌ను జైలుకు పంపినట్టు చెప్పారు.