DIL RAJU | టాలీవుడ్ నిర్మాత అల్లుడికి చెందిన రూ.కోటిన్నరకుపైగా విలువైన పోర్షే కారు అపహరణకు గురి కావడంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఉలిక్కిపడ్డారు. అయితే.. గంటల్లోనే విచారించి కారు జాడను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.. నిర్మాత దిల్‌రాజు అల్లుడు అర్చిత్‌రెడ్డి శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌కు రూ.1.7కోట్ల విలువైన తన పోర్షే కారులో వెళ్లారు.
కారును హోటల్ వద్ద నిలిపి లోపలికి వెళ్లి 40 నిమిషాల తరువాత తిరిగి రాగా కారు కనిపించలేదు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనాస్థలానికి వెళ్లిన డీఐ వీరశేఖర్, డీఎస్సై రాజశేఖర్ వివరాలు తెలుసుకున్నారు. వెంటనే సిబ్బందిని రంగంలోకి దించి సీసీ కెమెరాలను పరిశీలించారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద కారు సిగ్నల్ జంప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే కేబీఆర్ ఉద్యానవనం వద్ద ఉన్న ట్రాఫిక్ పోలీసులను అప్రమత్తం చేసి కారును నిలువరించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
పట్టుబడిన వ్యక్తి తాను ఆకాశ్ అంబానీ వ్యక్తిగత సహాయకుడినని, కేటీఆర్ కారు తీసుకెళ్లాలని సూచించారని, తాను తన సహాయకుడు హృతిక్‌రోషన్ కలిసి కారులో అకాశ్ అంబానీని కలవడానికి వెళ్లాల్సి ఉందంటూ చెప్పుకొచ్చాడు. అతని మాటలతో కంగుతిన్న పోలీసులు తలలు పట్టుకున్నారు. అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చేయగా మతిస్థిమితం లేదని, బ్రైట్ లైఫ్ ఫౌండేషన్ సంస్థలో చికిత్స పొందినట్లు గుర్తించారు. నిందితుడు మన్సూరాబాద్ ప్రాంతానికి చెందిన మల్లెల సాయికిరణ్‌గా గుర్తించారు