NTR DISTRICT | ఎన్టీఆర్ జిల్లాలో పార్ట్‌టైం ఉద్యోగం పేరిట మహిళను మోసం చేసిన నిందితులపై కేసు నమోదైంది. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎం.కోకిలసాయి తాడిగడప మనోజ్‌నగర్ నివాసి. ఈమె సెల్‌ఫోన్‌కు గత నెల 17వ తేదీన పార్ట్‌టైం ఉద్యోగం ఉందంటూ మెసేజ్ వచ్చింది. దీనిని ఆమె పరిశీలించగా దేవికాకేస్వాని, మనోజ్‌కుమార్‌లు సంప్రదించి ఐడీని క్రియేట్ చేసి లాగిన్ అవ్వాలంటూ తెలిపారు.
ఉద్యోగం నిరీక్షిస్తున్న ఈమెను రూ.10 వేలుగా ఇచ్చి పని ప్రారంభించమన్నారు. ఆ తర్వాత రూ.1022 కమిషన్ ఇచ్చారు. అనంతరం రూ.10 వేలు కట్టాలంటూ తెలుపగా కోకిలసాయి ఆన్లైన్లో చెల్లించింది. ఇదే తరహాలో ఉద్యోగంపై ఆశతో విడతల వారీగా వారు చెప్పినంత చెల్లించింది. ఈ క్రమంలో కొద్ది రోజుల కిందట రూ. 2 లక్షలు చెల్లించాలంటూ వారు పేర్కోవడంతో తాను కట్టలేనని తెలిపింది.
అప్పటికే కోకిలసాయి రూ.1.41 లక్షలు చెల్లించింది. నిర్వాహకులు ఈ నగదును ఆమెకి చెల్లించకపోగా సరైన సమాధానం కూడా చెప్పడం లేదు. మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.