GUNTUR | గుంటూరు జిల్లాలో చోరీకి యత్నించిన దొంగపై వ్యక్తి దాడి చేయడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన కొత్తపేట పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అర్ధరాత్రి రైల్వేస్టేషన్ రోడ్డులోని న్యూ అజంతా లాడ్జి ముందు వెళుతున్న ఓ వ్యక్తి చేతిలోని బ్యాగ్‌ను దొంగ లాక్కోవడానికి యత్నించాడు.
అప్రమత్తమైన బ్యాగ్ సొంతదారు ప్రతిఘటించి దొంగ తలపై రాయితో బలంగా కొట్టి వెళ్లిపోయాడు. రక్తగాయాలతో పడిఉన్న క్షతగాత్రుడిని గుర్తించిన స్థానికులు స్పందించి 108 అంబులెన్స్‌లో జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు.
కానీ.. మృతుడి పేరు, వివరాలు తెలియలేదని, వయసు 45 ఏళ్లు ఉండొచ్చని కొత్తపేట సీఐ అన్వర్ బాషా తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతుడి వివరాలు తెలిస్తే పోలీసుస్టేషన్లో సంప్రదించాలని ఆయన కోరారు.