EFLU | ఆంగ్లం, విదేశీ భాషల యూనివర్సిటీ(ఇఫ్లూ)లో ఓ విద్యార్థినిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి యత్నించడం కలకలం రేపింది. వర్సిటీ ప్రాంగణంలో రాత్రి ఈ ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది.
ఓయూ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇఫ్లూలో ఎంఏ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని బుధవారం రాత్రి 10 గంటల సమయంలో వర్సిటీ ప్రాంగణంలోని సిబ్బంది క్వార్టర్స్ వైపు నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా దూసుకొచ్చి బలవంతంగా పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించారు. యువతి గట్టిగా కేకలు వేస్తూ తీవ్రంగా ప్రతిఘటించడంతో ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు.
వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా సిబ్బంది గాలించినా ఎవరూ చిక్కలేదు. దీనిపై బాధితురాలు ఓయూ ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈస్ట్‌జోన్ డీసీపీ సునీల్ దత్, ఏసీపీ సైదయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు లేవు. నిందితుల్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గతంలో ఇదే యూనివర్సిటీలో చదువుతున్న ఓ విదేశీ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే.