MACHILIPATNAM | ప్రియుడి మోజులో బంగారంతో ఉడాయించిన లేడీ మేనేజర్ చిన్న తప్పుతో పోలీసులకి దొరికిపోయింది. కంకిపాడు మణప్పురం గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలో గత రాత్రి 10.660 కిలోల బంగారం చోరీ చేసి తన సన్నిహితుడితో ఉడాయించిన బ్రాంచి మేనేజర్ రెడ్డివెంకట పావనిని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెచోరీ చేసిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. గుడివాడ రూరల్ లింగవరం అడ్డరోడ్డుకు చెందిన రెడ్డివెంకట పావని గత ఫిబ్రవరిలో కంకిపాడు బ్రాంచికి బదిలీపై వచ్చింది.
ఆమె భర్తతో మనస్పర్థల కారణంగా కంకిపాడులో వేరుగా ఉంటోంది. కృత్తివెన్నుకు చెందిన ఓ వ్యక్తితో సన్నిహితంగా మెలుగుతోంది. అతడు ఓ ప్రైవేటు పాఠశాలను నడుపుతున్నాడు. అతడికి అప్పులు ఉండటం, ఇద్దరూ విలాసవంతమైన జీవితం గడపాలన్న ఉద్దేశంతో చోరీకి పథక రచన చేశారు. ఈ క్రమంలోనే ఈనెల 16వ తేదీన ఆమె ఈ చోరీకి పాల్పడింది. అదేరోజు రాత్రి ఇంటికి వెళ్లి ఇంట్లో తన బ్యాగు, సెల్ఫోను ఉంచి బంగారంతో పాటు తన సన్నిహితుడి కారులో వెళ్లింది.
బంగారం అతడికి ఇచ్చి కొంత బంగారం తీసుకుని తన బంధువులు శిర్డి వెళుతుంటే వారితోపాటు అక్కడికి వెళ్లిపోయింది. బంధువుల ఫోన్ నుంచి తన కుటుంబ సభ్యులతో పావని మాట్లాడటంతో పోలీసులు అప్పటికే వారిపై నిఘా పెట్టడటం.. ఆమె ఎక్కడుందనే విషయాన్ని తెలుసుకుని వెంటనే బృందాలుగా ఏర్పడి శిర్డి బయలుదేరి వెళ్లారు. శిర్డిలో ఆమెను గుర్తించి పట్టుకుని శుక్రవారం రాత్రి కంకిపాడుకు తీసుకు వచ్చారు. ఈ విషయాలను పోలీసులు నిర్ధారించలేదు.