UTTARPRADESH | హాస్టల్లో సూసైడ్ చేసుకుని చనిపోయిన ఓ మహిళా కానిస్టేబుల్ మృతదేహంపై 500కుపైగా గాయాల గుర్తులు కనిపించడం కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కానిస్టేబుల్ ఆత్మహత్యకు దారితీసిన కారణాలు, ఆమె శరీరంపైౖకి ఆ గాయాలు ఎలా వచ్చాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఈ కేసు వెలుగుచూసింది. ఉన్నావ్.. పోలీస్ లైన్‌లోని వసతిగృహంలో నివాసం ఉంటున్న మీను అనే మహిళా కానిస్టేబుల్.. గురువారం తన గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి యత్నించింది. అక్కడే ఉన్నవారు అప్రమత్తమై ఆమెను ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ఆమె మృతదేహానికి శవ పరీక్షలు నిర్వహించారు. ఆ నివేదికలో మహిళా కానిస్టేబుల్ ఉరివేసుకుని చనిపోయిందని, మృతదేహాంపై 500కుపైగా గాయాల గుర్తులు ఉన్నట్లు వెల్లడైంది.
అలీగఢ్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌తో మీను ప్రేమలో ఉన్నట్లు స్థానికులు చెప్పారు. అతడు మీనును మోసం చేసి వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడని.. బాధితురాలు ఎన్నిసార్లు ఫోన్‌చేసినా సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మీను.. తననుతాను గాయపరుచుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.