GUNTUR DISTRICT | ఎక్కడైనా నవజాత శిశువు అమ్మకం గురించి ప్రభుత్వ వైద్యులకు తెలిస్తే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి దాన్ని అడ్డుకుంటారు. అందుకు విరుద్ధంగా కాన్పు చేయడం నుంచి పసిబిడ్డను అమ్మి సొమ్ము చేసుకోవడం వరకు అన్నింట్లో ఓ ప్రభుత్వ వైద్యురాలు కీలకంగా వ్యవహరించిన విషయం తెనాలిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గుంటూరు జిల్లా తెనాలిలో పనిచేస్తున్న ఓ ప్రభుత్వ వైద్యురాలు, అదే పట్టణంలోని తన క్లినిక్‌లో గర్భిణులకు వైద్యపరీక్షలు చేస్తుంటారు. తనకు తెలిసిన ఓ ఆసుపత్రిలో కాన్పుచేస్తారు. ఆ క్రమంలో ఓ గర్భిణికి కాన్పు చేసి, శిశువును పిల్లలు లేని ఓ మహిళకు సుమారు రూ.10 లక్షలకు అమ్మి లబ్ధి పొందారు. ఇందుకు ఆధారాల్లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పసిబిడ్డను కొన్న మహిళే ప్రసవించినట్లు ఆసుపత్రి రికార్డుల్లో చూపారు. ఆ కాన్పు తాను కాకుండా, అదే ఆసుపత్రిలో కాన్పులు చేసే గుంటూరుకు చెందిన ప్రభుత్వవైద్యురాలు చేసినట్లు పేర్కొన్నారు.
గతేడాది ఏప్రిల్‌లో జరిగిన ఈ శిశువు అమ్మకం గురించి పట్టణానికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థకు తెలిసింది. వారు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన విచారణకు ఆదేశించారు. విచారణకు వచ్చిన అధికారులకు ఆసుపత్రి యాజమాన్యం జరిగినదంతా చెప్పింది. దీనంతటికీ కారకురాలు తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలని తేల్చిచెప్పారు. ఇదంతా ఆమెకు తెలిసి, తన పేరెందుకు బయటపెట్టారని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. తర్వాతి నుంచి యాజమాన్యం ఇక్కడ అలాంటిదేమీ జరగలేదని ప్రశ్నించిన వారికి చెబుతోంది. ఆ శిశువు బాపట్ల జిల్లా చుండూరు మండలంలో ఉన్నట్లు సమాచారం. స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు మేరకు శిశువు అమ్మకం ఘటనపై విచారణకు ఆదేశించినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి శ్రావణ్‌బాబు తెలిపారు.