KARNATAKA FARMERS | కర్ణాటకలో హామీల వర్షం కురిపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అమలులో మాత్రం అంచనాల్ని అందుకోలేకపోతోంది. దాంతో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్‌కి ఆ రాష్ట్రం నుంచి కొత్త తలనొప్పి మొదలైంది. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని ఆ రాష్ట్ర రైతులు ఆరోపించారు. కర్ణాటక సరిహద్దులోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు, రైతులు బుధవారం వికారాబాద్ జిల్లా కొడంగల్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి నిరసన ర్యాలీ చేపట్టారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. ఇచ్చిన హామీ ప్రకారం విద్యుత్తు సరఫరా కావడం లేదని, గ్యారెంటీలను అమలు చేయడం లేదని ఆందోళనకారులు ఆరోపించారు. తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేరుకోగానే స్థానిక కాంగ్రెస్ నాయకులు వారిని అడ్డుకున్నారు. అయినప్పటికీ.. ఆందోళనకారులు అక్కడి నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు వస్తుండగా మరోసారి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వారిని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించవద్దంటూ పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం, పోలీసులు కుమ్మకై కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ హామీలపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.