MLA HARIPRIYA | అధికార పార్టీ బీఆర్ఎస్కి ఇల్లందు నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. ఆ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్‌కు నిరసన సెగ తగిలింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సింగారంలో ఆమె ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆమెను అడ్డుకున్నారు. రేషన్ షాపులో సన్న బియ్యం ఇవ్వడంలేదని, నూకలు తిని బతుకుతున్నామని నిరసన తెలిపారు. సన్నబియ్యం ఎప్పుడిస్తారని నిలదీశారు. ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకున్నా తమకు ఆసరా పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదన్నారు.
ఎమ్మెల్యే హరిప్రియ ఎంత సముదాయించినా గ్రామస్తులు మాత్రం వెనక్కి తగ్గకుండా ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ ను గెలిపించాలని, కేసీఆర్ మూడోసారి సీఎం అయ్యాక సన్న బియ్యం ఇస్తామన్నారు. కానీ.. రెండు సార్లు గెలిచినా సంక్షేమ పథకాలు అందలేదని.. ఇప్పుడు మళ్లీ గెలిపిస్తే ఇస్తామనడం ఏమిటని గ్రామస్తులు ఆమెను నిలదీస్తూ ప్రచారాన్ని అడ్డుకున్నారు.
గ్రామస్థుల దెబ్బకి ఆమె ప్రచారాన్ని మధ్యలోనే ఆపేసి గ్రామం నుంచి వెళ్లిపోయారు. గ్రామస్తులు తనను అడ్డుకుంటే ఏం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు, సర్పంచ్, ఇతర నాయకులపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు.