MUNUGODE BJP | మునుగోడులో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేంద్రంగా గత కొన్నిరోజులు సాగిన బీజేపీ, కాంగ్రెస్ రాజకీయాలు ఓ కొలిక్కి వచ్చాయి. ఆయన బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరబోతున్నట్లు కూడా ప్రకటించారు. దాంతో మునుగోడు నుంచే కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతానని, పార్టీ ఆదేశిస్తే.. CM KCR పై గజ్వేల్ లో కూడా పోటీ చేయడానికి సిద్ధమని తన సంసిద్ధత ప్రకటించారు. ఇప్పుడు బీజేపీ మునుగోడులో తన అభ్యర్థి ఎవరో తేల్చుకోవాల్సి వస్తోంది.
రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఇప్పటికే బీసీ మంత్రం పఠిస్తోంది. తాము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామంటూ ప్రచారం మొదలుపెట్టింది. మరో వైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో జరిగిన డ్యామేజీని రిపేరు చేసుకునే పనిలో పడింది. మునుగోడు నియోజకవర్గం నుంచి గతంలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు గంగిడి మనోహర్ రెడ్డి రెండు ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ, మునుగోడుకు అనివార్యంగా ఉపఎన్నికలను తీసుకువచ్చి, రాజగోపాల్ రెడ్డిని ప్రయోగించిన బీజేపీ ఇప్పుడు ఎటూ పాలుపోని స్థితిలో ఉంది.
ఈ ఉపఎన్నికల సమయంలోనే బీఆర్ఎస్ నుంచి వచ్చి కాషాయ కండువా కప్పుకున్న డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ను మునుగోడు నుంచి మళ్లీ బరిలోకి దింపే యోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మునుగోడు నియోజకవర్గంలో అత్యధికంగా 66 శాతానికి పైగా బీసీ ఓటర్లు ఉన్నారు. వీరిలో ప్రధానంగా బూర నర్సయ్య గౌడ్ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు రమారమి 17 శాతం మంది ఉన్నారు. దీంతో ఈ సారి మునుగోడు నుంచి బీసీ అభ్యర్థిని బరిలోకి దింపాలన్న యోచనలో కేసీఆర్ ఉన్నారు.