RAILWAY KODURU | మద్యం ఇప్పించలేదని యువకుడిని హత్య చేసిన ఘటన రైల్వేకోడూరు పట్టణంలోని టోల్గేట్ మలుపు వద్ద జీపుల స్టాండు సమీపంలో రాత్రి చోటుచేసుకుంది. సీఐ మధుసూదన్ రెడ్డి ఎస్.ఐ. వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక నరసరాంపేటలో నివాసం ఉంటున్న రవికుమార్ కుమారుడు హనీకుమార్ ఓ ప్రైవేటు కంపెనీలో డెలివరీ బాయ్ పనిచేస్తున్నాడు.
పనిముగియగానే తరచూ స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తుంటాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ముగ్గురు స్నేహితులను టోల్గేట్ మలుపు వద్ద కలిశాడు. తమకు మద్యం ఇప్పించాలని స్నేహితులు కోరగా, తన వద్ద డబ్బులు లేవని హనీకుమార్ చెప్పాడు. ఈ విషయమై స్నేహితుల మధ్య మాటామాటా పెరిగి వివాదానికి దారితీసింది.
స్నేహితులంతా కలిసి హనీకుమార్పై కత్తితో దాడిచేయడంతో రక్తపుమడుగులో పడిపోయాడు.
విషయం తెలుసుకున్న స్థానికులు, కుటుంబసభ్యులు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే హనీకుమార్ మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనకు సంబంధించి కొంతమందిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితుల్లో ఒకరు ఎర్రచందనం కేసుల్లో పాత ముద్దాయిగా ఉన్నట్లు సమాచారం. త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తామని సీఐ వివరించారు.