BANANA | అరటిపండు ఏడాది పొడవునా లభించడం, రుచిగా, కొనడానికి చౌకగా ఉండటంతో తినడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ఇది చాలా శక్తిని కూడా ఇచ్చే పండు. అయితే అరటిపండును ఎప్పుడు తినాలి, పరగడుపున తింటే మంచిదా? కాదా? అనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది.
అరటిపండులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం లాంటి అనేక పదార్థాలు ఉంటాయి. దీనిని తినడం ద్వారా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. అరటిపండును సరైన మోతాదులో తీసుకుంటే బరువు కూడా ఎంచక్కా తగ్గొచ్చు. అయితే దీనిని సరైన సమయంలో తీసుకుంటే దీని ఫలితాన్ని ఎక్కువగా పొందవచ్చు.
కొంతమంది పరగడుపున లేదా ఎలాంటి ఆహారం తీసుకోకముందు అరటిపండును తీసుకుంటూ ఉంటారు. అలా తినడం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతుంటారు. ఎందుకంటే అరటి పండ్లలో ఎసిడిక్ నేచర్ ఉంటుంది. దీని వల్ల ఉదయాన్నే ఏమి తీసుకోకుండా ఖాళీ కడుపుతో వీటిని తినడం ద్వారా జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. ప్రేగుల ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇతర ఆహార పదార్థాలతో కలిపి అరటిపండును తీసుకుంటే ఉత్తమమని చెప్పవచ్చు.
కొన్ని ప్రాంతాల్లో అరటిపండును పెరుగన్నంతొ, ఓట్స్ తో, ఇతర పండ్లతో కలిపి తీసుకుంటూ ఉంటారు. అలా తీసుకోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అరటిపండ్లలో పచ్చి అరటి, పండు అరటి అని రెండు రకాలు ఉంటాయి. పచ్చి అరటి తీసుకోవడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆహారం ప్రేగుల్లో త్వరగా కదలడానికి, జీర్ణం కావడానికి ఉపయోగపడుతుంది.