CYBER CRIME | వృద్ధాప్యంలో భరోసాగా ఉంటుందని ఓ వృద్ధ జంట దాచుకున్న డబ్బుపై కన్నేసిన సైబర్ నేరగాళ్లు.. ఆ జంటను మభ్యపెట్టి విడతల వారీగా రూ.4.35 కోట్లు దోచుకున్న ఘటన ముంబయిలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబయిలోని కఫ్ పరేడ్ పోలీస్స్టేషన్ పరిధిలో 70 ఏళ్లు పైబడిన వృద్ధ జంట నివసిస్తోంది. వృద్ధురాలి భర్త గతంలో ఓ ప్రముఖ ఐటీ, కన్సల్టింగ్ కంపెనీలో ఉద్యోగం చేసి రిటైరయ్యారు. వృద్ధురాలికి మే నెలలో గుర్తు తెలియని మహిళ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాను ఎంప్లాయీస్ ఫ్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ నుంచి ఫోన్ చేస్తున్నానని చెప్పింది.
ఆమెను నమ్మించేందుకు భర్తకు సంబంధించిన వివరాలన్నీ చెప్పింది. దీంతో ఆ మహిళను వృద్ధురాలు పూర్తిగా నమ్మింది.
భర్త పీఎఫ్ ఖాతాలో 20 ఏళ్ల కాలానికి కంపెనీ రూ.4 లక్షలు డిపాజిట్ చేసినట్లు ఆ మహిళ పేర్కొంది. ఇప్పుడు అది మెచ్యూర్ అయిందని, విత్డ్రా చేసుకుంటే రూ.11 కోట్ల మొత్తం వస్తుందని నమ్మబలికింది. ఇందుకోసం టీడీఎస్, జీఎస్టీ, ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఆమె చెప్పింది నిజమేనని నమ్మి కాల్ చేసిన మహిళ చెప్పినట్లుగా ఓ బ్యాంకు ఖాతాలో ఆ వృద్ధ జంట డబ్బు జమ చేసింది.
అలా సెప్టెంబరు వరకు విడతల వారీగా రూ.4.35 కోట్లు జమ చేశారు. ఇంకా సొమ్ములు కావాలని కాల్ చేసిన వ్యక్తి డిమాండ్ చేయడంతో తమ దగ్గర లేవని జంట సమాధానమిచ్చింది. అప్పటి వరకు సౌమ్యంగా అడుగుతూ వచ్చిన మహిళ.. తర్వాతి నుంచి ఐటీ శాఖకు సమాచారం ఇస్తామంటూ బెదిరించడం ప్రారంభించింది. ఈ చర్యలతో మోసపోయామని గమనించిన ఆ వృద్ధ జంట పోలీసులను ఆశ్రయించింది. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు