MUNUGODE ELECTIONS | బీజేపీ లీడర్ కోమటిరెడ్డి RAJAGOPAL REDDY మళ్లీ తిరిగి కాంగ్రెస్లో చేరడంతో మునుగోడులో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. మునుగోడు నుంచి కాంగ్రెస్ టికెట్ తనకే వస్తుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చలమల్ల కృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వాస్తవానికి రాజగోపాల్రెడ్డి తొందరపడకుండా ఉండి ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండేవారు. కానీ ఆయన బీజేపీలో చేరడం ఆ తర్వాత రాజీనామా చేసి ఉప ఎన్నికలకి వెళ్లి ఓడిపోయారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్లో చేరడంతో మునుగోడు నాయకుడు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చలమల్ల కృష్ణారెడ్డి చిన్న రిక్వెస్ట్ చేస్తున్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం శుభసూచకమని, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా స్వాగతిస్తున్నారన్నారు. రాజగోపాల్ రెడ్డి చేరికతో మునుగోడులో కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుందన్నారు. ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి సహకారం, సీపీఎం, సీపీఐ మద్దతుతో తానే పోటీలో ఉంటానని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లోనే తనకు టికెట్ రావాల్సి ఉండేదని, కొన్ని కారణాల వల్ల పాల్వాయి స్రవంతికి ఇచ్చారన్నారు. అయినా పార్టీ గెలుపు కోసం తాను కష్టపడ్డానని గుర్తు చేశారు.
ఉప ఎన్నిక తర్వాత అధిష్టానం మునుగోడు టికెట్ పై తనకు పూర్తి హామీ ఇచ్చిందన్నారు. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాష్ట్ర నాయకుడని, ఆయన స్టేట్లో ఎక్కడి నుంచైనా పోటీ చేసి గెలవవచ్చని, తాను మాత్రం కేవలం మునుగోడు ప్రజలకే పరిమితమన్నారు. ఉప ఎన్నిక తర్వాత14 నెలలు కింద పడిపోయన కాంగ్రెస్ ను నెత్తిన పెట్టుకుని కాపాడానని, ఈ విషయం అధిష్టానానికి కూడా తెలుసన్నారు. టికెట్ విషయంలో కార్యకర్తలెవరూ ఆందోళన చెందవద్దన్నారు. రాజగోపాల్రెడ్డి పెద్ద మనసు చేసుకొని మునుగోడు సీటును తనకు వదిలేయాలని ఆయన రిక్వెస్ట్ చేశారు.