BRS | కేసీఆర్ సభకి వస్తే రూ.250 ఇస్తామని ప్రజలకి బీఆర్ఎస్ నేత ఆఫర్ ఇచ్చారు. వాట్సాప్లో ఆ మెసేజ్ ఇటు.. అటు తిరిగి చివరికి ఎన్నికల అధికారుల వద్దకి వెళ్లింది. దాంతో కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఇంతకీ విషయం ఏంటంటే.. వరంగల్ జిల్లా భట్టుపల్లిలో నిర్వహించే సీఎం కేసీఆర్ సభకు వచ్చినవారికి రూ.250 ఇస్తామని ఒక గ్రూప్లో పోస్టు పెట్టారు. కానీ విషయం కాస్తా ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో కథ అడ్డం తిరిగింది.
ఎన్నికల స్పెషల్ స్క్వాడ్ ఆఫీసర్ సురేష్ కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం దౌలత్నగర్ గ్రామశివారు మాలోత్తండా గ్రామస్థులకు వాట్సాప్ గ్రూపు ఉంది. వర్ధన్నపేట నియోజకవర్గం భట్టుపల్లిలో నిర్వహించే సీఎం సభకు ప్రజలు భారీగా తరలిరావాలని, సభకు వచ్చిన వారికి ఒక్కొక్కరికి రూ.250 చొప్పున అందిస్తామని తండాకు చెందిన BRS నాయకుడు మాలోత్ నవీన్ గ్రూపులో పోస్టు చేశాడు. ఇందుకోసం గ్రామ ఇన్చార్జి మాలోత్ మున్యాను సంప్రదించాలని, అతడి ఫోన్నెంబర్ను కూడా గ్రూపులో పోస్టు చేశాడు.
కానీ.. ఇదే గ్రూపులో ఉన్న ఇతర పార్టీలకు చెందిన కొందరు ఆ పోస్టును స్క్రీన్ షాట్ తీసి ఎన్నికల అధికారులకు సమాచారం అందించారు. విచారణ చేపట్టిన అధికారులు.. పోస్టు పెట్టిన మాలోత్ నవీన్, మాలోత్ మున్యా, గ్రూప్ అడ్మిన్లు రాజు, సుమన్లపై కేసు నమోదు చేయాలని పర్వతగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు