CM KCR | తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రచారంలో దూకుడు పెంచుతున్నారు. సీనియర్ నాయకుడు, ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై డైరెక్ట్ అటాక్ చేశారు. పాత స్నేహాన్ని గుర్తు పెట్టుకుని తుమ్మలకి తాను ఎంతో చేశానని.. కానీ ఈరోజు అతను బీఆర్ఎస్కి అన్యాయం చేసి వెళ్లిపోయాడని విమర్శించారు. పాలేరులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉపేందర్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ఉద్వేగంగా ప్రసంగించారు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో పువ్వాడ అజయ్ చేతిలో ఓడినప్పటికీ అప్పట్లో తుమ్మలను పాత స్నేహం కారణంగా తాను చేరదీసి మంత్రిని చేశానని కేసీఆర్ గుర్తు చేశారు. ఆ తర్వాత రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణంతో పాలేరు స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆయన భార్యకు టికెట్ ఇవ్వాలని తొలుత భావించినప్పటికీ తుమ్మల రిక్వెస్ట్‌తోనే పాలేరులో ఆయననే బరిలో ఉంచామని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ తనకి అన్యాయం చేసిందని తుమ్మల చెప్పడం దారుణమని కేసీఆర్ మండిపడ్డారు.
పోలింగ్‌కి ముందు డబ్బు సంచులతో వచ్చే వారిని నమ్మొద్దని ప్రజలకి హితవు పలికిన కేసీఆర్.. రాష్ట్రంలో పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధుకు రాంరాం, దళిత బంధుకు జైభీమ్ అనేస్తారని ఎద్దేవా చేశారు. రైతు బంధు, రైతులకి కరెంట్ వద్దని చెప్తున్న కాంగ్రెస్‌కి ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని కేసీఆర్ పిలుపునిచ్చారు