SURYAPETA | తన భర్తకి ఎయిడ్స్ ఉందని.. అందుకే ఆవేదనతో ఉరివేసుకున్నట్లు భార్య నాటకం ఆడింది. కానీ.. తీగ లాగిన పోలీసులకి డబుల్ మర్డర్ విషయం వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం కారణంగా రెండు కుటుంబాలు ఛిన్నాభిన్నమైన ఘటన SURYAPETA లో చోటు చేసుకుంది.
SURYAPETA ఎస్పీ రాహుల్‌హెగ్డే తెలిపిన వివరాల ప్రకారం.. మోతె మండలం బళ్లుతండాకు చెందిన భూక్యా వెంకన్న కుటుంబంతో సూర్యాపేట భాగ్యనగర్ కాలనీలో నివసించేవారు. నూతనకల్ మండలం ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన షేక్ రఫీ తన భార్య నస్రీన్‌తో కలిసి పట్టణంలోని శ్రీరాంనగర్‌లో ఉండేవారు. వెంకన్నకు, నస్రీన్‌కు వివాహేతర సంబంధం ఏర్పడగా.. ఇద్దరూ తమ జీవిత భాగస్వాములను అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. పథకం ప్రకారం వెంకన్న ఈ ఏడాది జూన్ 8న రాత్రి భార్య రమాదేవితో కలిసి బళ్లుతండా నుంచి SURYAPETA కు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. దారిలో వాహనం నిలిపి భార్యను విద్యుత్తు స్తంభానికి కొట్టి హత్య చేశాడు. ఆమె రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు అందరినీ నమ్మించాడు.
మరోవైపు భర్త రఫీని హత్య చేసేందుకు నస్రీన్ వెంకన్నతో కలిసి పథకం రచించింది. ఈ నెల 9వ తేదీ రాత్రి 10.30 గంటల సమయంలో రఫీ బయటకు వెళ్లగా.. నస్రీన్ సెల్‌ఫోన్ ద్వారా వెంకన్నకు సమాచారమిచ్చింది. వెంకన్న తన మిత్రులైన మోతె మండలం సిరికొండకు చెందిన అక్కెనపల్లి శ్రీశైలం, నామారం గ్రామానికి చెందిన సారగండ్ల మధుతో కలిసి రఫీ ఇంట్లోకెళ్లి దాక్కున్నారు. అరగంట తర్వాత ఇంటికి చేరుకున్న రఫీని వారంతా కలిసి హత్య చేశారు. ఉరి వేసుకున్నాడని నమ్మించేందుకు రఫీ గొంతుకు చీరను బిగించి.. సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడదీశారు.
పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. రఫీకి ఎయిడ్స్ వచ్చిందని భార్య చెప్పడం, శరీరంపై కొట్టిన గాయాలు ఉండటంతో అతడి సోదరుడు సుభాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నస్రీన్ సెల్‌ఫోన్ కాల్‌డేటాను విశ్లేషించడంతో అసలు విషయం బయటపడింది. నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ వివరించారు. ఈ రెండు హత్యల వల్ల వెంకన్న ఇద్దరు కుమార్తెలు, నస్రీన్ కుమారుడు, కుమార్తె అనాథలయ్యారు. వీరంతా ఆరేళ్లలోపు చిన్నారులే కావడం గమనార్హం.