HYDERABAD | రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని చంపాపేట్‌లో జరిగిన 20 ఏళ్ల అమ్మాయి స్వప్న హత్యకేసులో మిస్టరీ వీడింది. భర్త ప్రేమ్‌కుమార్ ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో నిర్ధారించారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రేమ్‌కుమార్ నుంచి ఐ.ఎస్.సదన్ పోలీసులు ఉదయం వాంగ్మూలం సేకరించారు.
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మోహన్, రూప దంపతుల కుమార్తె స్వప్న. తల్లిదండ్రులు విడిపోవడంతో ఒంటరిగా ఉంటోంది. రీల్స్, వీడియోలతో సామాజిక మాధ్యమాల్లో గుర్తింపు తెచ్చుకొన్న ఆమెను ప్రేమిస్తున్నట్టు ఒకరిద్దరు వెంటపడ్డారు. వారిలో ఒక యువకుడికి ఆమె దగ్గరైంది. 8 నెలల క్రితం హన్మంతు అనే యువకుడు, తాను అన్నాచెల్లెళ్లంటూ చంపాపేట రాజిరెడ్డినగర్ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. స్వప్న నెలరోజుల క్రితం మహేశ్వరంలో టీ దుకాణం నడిపే ప్రేమ్‌కుమార్‌కి దగ్గరైంది. ఒక్కరోజు ప్రేమతోనే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. శుక్రవారం వరకూ వారు కలిసే ఉన్నారు. నెలరోజులుగా ఇంటికి తాళం వేసి ఉండడంతో స్వప్నకు చంపాపేట ఇంటి యజమాని ఫోన్ చేశారు.
తనకు పెళ్లయిందని… ఇల్లు ఖాళీ చేస్తానని సమాధానమిచ్చింది. శనివారం తెల్లవారుజామున ఆమె ఒంటరిగా చంపాపేటలోని ఇంటికి వచ్చింది. ఈ విషయం తెలిసిన ఆమె ప్రేమికుడు కూడా అక్కడకు వచ్చాడు. ఉదయం అక్కడకు వచ్చిన ప్రేమ్‌కుమార్ తన భార్యతో మరో యువకుడు చనువుగా ఉండడం చూశాడు. పట్టరాని కోపంతో వారిద్దరిపై దాడి చేశాడు. ఇంట్లోని కత్తితో భార్య గొంతుకోశాడు. కళ్లెదుట స్నేహితురాలు రక్తపుమడుగులో పడిపోవడంతో యువకుడు ప్రేమ్‌కుమార్‌తో గొడవపడ్డాడు.
గదిలో నుంచి బయటకు నెట్టుకుంటూ వచ్చి మేడమీద నుంచి కిందకు తోశాడు. అప్పటికే అక్కడకు ఆటోలో వచ్చిన మరొకరితో కలిసి ఆ యువకుడు పారిపోయాడు. రెండో అంతస్తు పైనుంచి పడిన ప్రేమ్‌కుమార్ తలకు బలమైన గాయాలు కావడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అత్యవసర చికిత్స విభాగంలో వైద్యసేవలు అందిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రేమ్‌కుమార్ పోలీసు వాంగ్మూలంలో వెల్లడించినట్టు తెలుస్తోంది. నిందితుడైన మరో యువకుడి కోసం ఐఎస్ సదన్ పోలీసులు గాలిస్తున్నారు.