TELANGANA | తెలంగాణలో రోజురోజుకీ రాజకీయాలు రంజుగా మారిపోతున్నాయి. ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఏమాత్రం ఆలోచించకుండా పక్క పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ఇందులో చాలా మంది అప్పటి వరకూ ఆ పార్టీలను తిట్టిపోసిన వాళ్లే కావడం గమనార్హం.
మొన్న కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాలక్ష్మయ్య, నిన్న బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, నేడు నాగం జనార్ధన్‌రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే సీనియర్ నాయకులు సైతం ఈ జంప్‌ల్లో ముందున్నారు. TELANGANA లో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని పార్టీలు దాదాపు అభ్యర్థులను ఖరారు చేసేశాయి. ఈ క్రమంలో టికెట్ల ఆశావహుల్లో కొందరికి ఆ పార్టీల అధిష్టానాలు షాక్ ఇచ్చాయి. దాంతో ఇక చెప్పేదేముంది రాత్రికి రాత్రే పార్టీలు మారిపోతున్నారు.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. కొందరి చేరికతో మరికొందరు ఆ నియోజకవర్గంలో ఇబ్బంది పడుతూ అక్కడి నుంచి జంప్ అయిపోతున్నారు. ఉదాహరణకి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో భవిష్యత్ లేదని, తిరిగి తన మాతృ పార్టీ కాంగ్రెస్‌లోకి వచ్చేశారు. అలానే కాంగ్రెస్ నుంచి మునుగోడు సీటు దక్కించుకున్నారు. దాంతో మునుగోడు కాంగ్రెస్ ఇన్చార్జ్గా ఉన్న కృష్ణారెడ్డి ఇప్పుడు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. నిజానికి బీజేపీకి కూడా అక్కడ అభ్యర్థి అవసరం ఏర్పడింది. ఇలా దాదాపు సగానికి పైగా నియోజకవర్గాల్లో చోటా మోట నాయకుడి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి వరకూ జంప్‌లు కనిపిస్తున్నాయి.