TS ELECTION | తెలంగాణలో కాంగ్రెస్, సీపీఎం పొత్తు ప్రమాదంలో పడింది. సీట్ల కేటాయింపు విషయంలో ఈ రెండు పార్టీలకి పేచీ పడింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సీపీఎం అక్టోబర్ 31 వరకు డెడ్లైన్ పెట్టింది. ఎన్నికల్లో సీపీఎం మిర్యాలగూడతో పాటు వైరా స్థానాలు ఇవ్వాలని గత కొన్నిరోజుగా పట్టుబడుతోంది. కానీ వైరాను సీపీఎంకు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఇష్టపడటం లేదు.
కొత్తగూడెం, చెన్నూరు స్థానాలను తీసుకునేందుకు సీపీఐ తొలుత అంగీకరించింది. అయితే సీపీఎంకు మిర్యాలగూడ స్థానం ఒకే కాగా.. రెండో సీటుగా ఖమ్మం, పాలేరు, భద్రాచలం, వైరా నాలుగింటిలో ఏదైనా ఒకటి ఇవ్వాలని పట్టుబట్టింది. కానీ సీపీఎం అభ్యర్థనను తోసిపుచ్చిన కాంగ్రెస్ అధిష్టానం.. పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పోటీలో ఉంచింది. ఖమ్మం నుంచి తుమ్మల, భద్రాచలం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు అవకాశం కల్పించింది. దీంతో సీపీఎం వైరా స్థానం కోసం పట్టుబడుతోంది.
వైరా స్థానం ఒకవేళ కేటాయించకుంటే పొత్తు ఉండదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తేల్చి చెప్పేశారు. నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ 3, సీపీఎం 26 స్థానాల్లో పోటీ చేసినా.. కనీసం ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయాయి. దాంతో కాంగ్రెస్ కూడా సీపీఎంని లైట్ తీసుకుంటోంది.