TS POLITICS | బీజేపీ సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం కొంత కాలంగా నడుస్తోంది. నిజానికి ఆయనతో పాటు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేరు కూడా గతంలో వినిపించగా.. ఆయన నిజం చేస్తూ హస్తం గూటికి చేరిపోయారు. ఇక వివేక్ వంతే మిగిలింది.
పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరపున ఎంపీగా బరిలో దిగుతానని చెప్తున్న వివేక్‌తో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇటీవల భేటీ కావడంతో పార్టీ మారడంపై ప్రచారం ఊపందుకుంది. ఇద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని వివేక్‌ను రేవంత్‌రెడ్డి ఆహ్వానించినట్టు తెలిసింది.
వివేక్ తండ్రి వెంకటస్వామి తుదిశ్వాస వరకూ కాంగ్రెస్‌లోనే కొనసాగారు. ఒక రకంగా చెప్పాలంటే వివేక్ కూడా కాంగ్రెస్‌లో వివేక్ పుట్టి, పెరిగారు. కానీ వ్యక్తిగత కారణాల రీత్యా బీఆర్ఎస్.. ఆ తర్వాత బీజేపీలోకి వెళ్లారు. అయితే గత కొంత కాలంగా ఆయన బీజేపీ కార్యకలాపాలకు దూరంగా వుంటున్నారు. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకోవడంతో ఇతర పార్టీల నేతలు ఆ పార్టీ వైపు దృష్టి సారిస్తున్నారు. పెద్దపల్లి ఎంపీ సీటును కాంగ్రెస్ పార్టీ వివేక్‌కు ఇవ్వొచ్చు. ఈ ఒప్పందం మేరకే వివేక్ ఆ పార్టీలో చేరే అవకాశాలున్నాయని తెలుస్తోంది