NTR DISTRICT | తల్లిదండ్రులకి తెలియకుండా అమ్మాయి మెడలో బలవంతంగా తాళి కట్టిన యువకుడిని ఎన్టీఆర్ జిల్లా కొండూరు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలానికి చెందిన ఓ అమ్మాయి పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది.
కొంతకాలంగా మండలంలోని రేపూడి శివారు జానలగడ్డకు చెందిన వాసం వెంకటేశ్వరరావు అనే యువకుడు.. ఆ అమ్మాయి వెంటపడి ప్రేమించమంటూ వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల దసరా సెలవులకు ఇంటికి వస్తున్న ఆ యువతిని వెంకటేశ్వరరావు మార్గమధ్యలో అడ్డుకొని ఆమె మెడలో బలవంతంగా తాళి కట్టాడు.
ఆ సమయంలో తీసిన ఫొటోలను తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడు. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఆ అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం నిందితుడు వెంకటేశ్వరరావును అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై ఆర్.అంకారావు వెల్లడించారు