TELANGANA | యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఓ దొంగ స్వామిజీ గృహ ప్రవేశం నెపంతో యజమాని కళ్లుగప్పి నగలతో ఉడాయించాడు. ఈ కేసులో స్వామీజీతో మరో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ ఎస్.దేవేందర్ తెలిపారు. చౌటుప్పల్ మండలం దేవలమ్మనాగారం గ్రామ సర్పంచి కల్లెం శ్రీనివాస్‌రెడ్డి నూతనంగా ఇంటిని నిర్మించారు.
ఇంటికి పూజలు చేయాలని హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ చింతల్‌కుంటకు చెందిన పరుశరామ్ చైతన్య స్వామీని సంప్రదించారు. ఇంటికి దోషం, నరదిష్టి ఉన్నాయని చెప్పి శ్రీ చక్ర వాస్తు పూజ చేయాలని స్వామీజీ చెప్పారు. అక్టోబరు 26న ఉదయం పది గంటలకు పూజలను ప్రారంభించాడు. పూజకు ఇంట్లోని బంగారాన్ని రాగి చెంబులో వేయాలని స్వామీజి సూచించాడు. ఆయన సూచన మేరకు కుటుంబ సభ్యులు రాగి చెంబులో బంగారు ఆభరణాలు వేశారు. పూజ మధ్యలో పది నిమిషాలు బయటికి వెళ్లి రమ్మని చెప్పారు. ఈ సమయంలో రాగి చెంబులోని బంగారు ఆభరణాలను స్వామీజీ తన సంచిలో వేసుకున్నాడు.
పూజ పూర్తి అయిన తర్వాత రాగి చెంబులోని ఆభరణాలను 15-30 రోజుల వ్యవధిలో ముట్టుకోవాలని లేకపోతే హాని కలుగుతుందని చెప్పాడు. అనంతరం స్వామీజీ తన కారులో హైదరాబాద్‌కు వెళ్లిపోయాడు. అపహరించిన ఆభరణాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం సోమవరం గ్రామానికి చెందిన పోలుబోయిన వెంకట నాగేశ్వర్రావుకు ఇచ్చాడు. అతను వాటిని ఓ ప్రైవేట్ సంస్థలో తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నారు.
పూజలు చేసిన మరుసటి రోజు 27న సర్పంచికి అనుమానం రావడంతో రాగి చెంబును పరిశీలించగా బంగారు నగలకు బదులు రాగి వస్తువులు కనిపించాయి. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని చౌటుప్పల్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో నల్గొండ జైలుకు తరలించారు. నిందితుల నుంచి ఫార్చునర్ కారు, బంగారు నగలను తనఖా పెట్టిన రశీదులను స్వాధీనం చేసుకున్నట్టు ఇన్స్పెక్టర్ తెలిపారు.