TS ASSEMBLY POLLS | తెలంగాణలో ఒకవైపు రాజకీయ పార్టీల ప్రచార జోరు.. మరోవైపు సర్వేల హోరులా పరిస్థితి తయారైంది. ప్రతి వారం ఏదో ఒక సర్వే ప్రజల నాడిని తెలియజేస్తోంది. దాంతో రాజకీయ పార్టీల్లోనూ టెన్షన్ మొదలైంది. తాజాగా తెలంగాణ ఎన్నికలపై చాణక్య స్టడీ రిపోర్ట్ విడుదల చేసింది.
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో దాదాపు 14 లక్షల మంది అభిప్రాయాలు తీసుకొని ఈ రిపోర్ట్ రూపొందించినట్లు మిషన్ చాణక్య వెల్లడించింది. ఈ సర్వేలో ఏం తేలిందంటే.. తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వైపే ప్రజలు మొగ్గు చూపబోతున్నారు. బీఆర్ఎస్ వైపు 44.62 శాతం మంది మొగ్గు చూపారని.. అలానే కాంగ్రెస్ పార్టీకి 32.71 శాతం మంది మద్దతు తెలిపినట్లు చాణక్య స్టడీ రిపోర్ట్‌లో స్పష్టం చేసింది. ఇక బీజేపీకి కేవలం 17.6 శాతం ఓటింగ్ పడే అవకాశం ఉన్నట్లు తేల్చింది.
సామాజిక వర్గాల వారీగా తీసుకుంటే బ్రాహ్మణ, ఆర్య వైశ్యులు బీజేపీ వైపు మొగ్గు చూపిస్తుండగా.. అనూహ్యంగా ఆదివాసీలు కూడా బీజేపీ వైపు ఉండటం గమనార్హం. ఇక మైనార్టీలు బీఆర్ఎస్,
కాంగ్రెస్‌కు సమానంగా మద్దతు ఇస్తున్నారు. కానీ క్రిస్టియన్లు మాత్రం పూర్తిగా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. రైతులు, ప్రైవేట్ ఉద్యోగులు, నిరుద్యోగులు మాత్రం బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ వైపు ఎక్కువ చూస్తున్నట్లు ఈ సర్వేలో తేలింది