PALNADU | పల్నాడులో కుమార్తెతో వైద్యుడి ప్రేమ వ్యవహారం నచ్చక ఓ తండ్రి హంతకుడు అయ్యాడు. ఫిరంగిపురం మండలం 113 తాళ్లూరుకు చెందిన శ్రీనివాసరెడ్డి, పల్నాడు జిల్లా నరసరావుపేటలో రీజినల్ సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. తన కూతురును ఫార్మా డి చదివించారు. ఆమె గుంటూరువారితోటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్‌గా పనిచేస్తున్నారు. అక్కడే ఫిజియోథెరఫీ వైద్యుడిగా పనిచేస్తున్న PALNADU జిల్లా బెల్లంకొండకు చెందిన సత్తెనపల్లి సీతారామాంజనేయులు ఆమెకు పరిచయమై ప్రేమించాడు.
అప్పటికే అతడికి తన బంధువుల అమ్మాయితో పెళ్లయింది. భార్యతో మనస్పర్థలు తలెత్తడంతో విడిగా ఉంటున్నారు. ప్రేమ విషయం నచ్చని యువతి తండ్రి శ్రీనివాసరెడ్డి ఆమెను ఉన్నత చదువుల కోసం ఏడాది క్రితం అమెరికాకు పంపించాడు. రెండేళ్ల కోర్సు చదవాల్సి ఉండగా, పూర్తి కాకుండానే ఆమె గుంటూరుకు రావడానికి సిద్ధమైంది. దాంతో ఇప్పుడే వద్దు డిసెంబరులో రమ్మని తండ్రి శ్రీనివాసరెడ్డి ఎంత చెప్పినా వినిపించుకోలేదు. సీతారామాంజనేయులు ఏం చెబితే అది చేస్తానంది.
కూతురు భవిష్యత్తు పాడవుతుందని: తన కూతురు భవిష్యత్తును వివాహితుడైన సీతారామాంజనేయులు నాశనం చేస్తున్నాడని, ఎలాగైనా అతడి అడ్డు తొలగించుకోవాలని శ్రీనివాసరెడ్డి పథకం పన్నాడు. ఒక సంచిలో ఇనుప సుత్తి, కారంపొడి పెట్టుకొని గత నెల 29వ తేదీ రాత్రి గుంటూరువారితోటలోని సీతారామాంజనేయులు ఇంటికి వెళ్లాడు. తన కుమార్తెను విదేశాల నుంచి ఇప్పుడు రావద్దని చెప్పమని కోరాడు. అందుకు వైద్యుడు నిరాకరించడంతో ఆగ్రహించిన శ్రీనివాసరెడ్డి సంచిలో ఉన్న కారంపొడిని సీతారామాంజనేయులు కంట్లో చల్లి, ఇనుప సుత్తితో తలపై బలంగా కొట్టి చంపాడు. ఈక్రమంలో రక్తం చింది చొక్కాపై పడింది. ఘటనా స్థలిలోనే మరో చొక్కాను మార్చుకున్నాడు. పోలీసు జాగిలాలు పసికట్టకుండా మిగిలిన కారం పొడిని ఆ ప్రాంతంలో చల్లాడు.
రక్తంతో తడిసిన చొక్కా, ఇనుప సుత్తిని ఒక కవరులో వేసుకొని, ఫిరంగిపురం మండలం సిరిపురంలోని 30 అడుగుల లోతు ఉన్న బావిలో సుత్తి, చొక్కా పడేసి జడ్చర్ల వెళ్లాడు. కేసు నమోదు చేసిన కొత్తపేట సీఐ అన్వర్ బాషా దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీతో పాటు ఘటనా స్థలిలో లభించిన ఆధారాలతో శ్రీనివాసరెడ్డి నిందితుడని నిర్ధారించుకున్నారు. నిందితుడు 113 తాళ్లూరులోని తన ఇంటికి వెళుతుండగా అక్కడ పోలీసులు అరెస్టు చేశారు.