TELANGANA NEWS | తెలంగాణలో ఈరోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. ఈరోజు ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అభ్యర్థులు నామినేషన్‌తోపాటు తన నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, ఇతరత్రా వ్యక్తిగత వివరాలను మొత్తం తెలియజేయాల్సి ఉంటుంది. ఈ నెల 10వ తేదీ వరకూ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు.
ఈ నామినేషన్లని సెలవు రోజుల్లో స్వీకరించరు. నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన.. ఆ తర్వాత 15న ఉపసంహరణకు గడువు విధించారు. నామినేషన్లకు సంబంధించి ప్రతి రోజూ గడువు ముగిసిన తర్వాత వివరాలను ఎన్నికల అధికారులు వివరాలను వెల్లడిస్తారు. అలాగే నామినేషన్ దాఖలు చేసే సందర్భంలో అభ్యర్థులు సమర్పించిన అఫడివిట్లను ఎప్పటికప్పుడు ఈసీఐ(ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా) వెబ్సైట్లోనూ అప్లోడ్ చేస్తారు. నామినేషన్ వేసే సందర్భంలో అభ్యర్థులు విధిగా నిబంధనలు పాటించాల్సి వుంటుంది.
నామినేషన్ టైమ్‌లో అభ్యర్థితో పాటు ఐదుగురిని మాత్రమే ఆర్వో కార్యాలయంలోకి అనుమతిస్తారు. అలాగే రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల పరిధిలో ఒక్కో అభ్యర్థికి సంబంధించిన మూడు వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.