YS SHARMILA | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పిన వైయస్ షర్మిల.. సడన్‌గా యూ టర్న్ తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. తాను రెండు నియోజకవర్గాలనుంచి బరిలో ఉంటానని, తనతో పాటు తన తల్లి, తన భర్త కూడా ఎన్నికల్లో పోటీచేయాలని ప్రజలు కోరుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించిన షర్మిల ఇలా మిడిల్ డ్రాప్ అవడానికి ఓ రాజకీయ వ్యూహం ఉందట.
‘గెలుపు గొప్పదే. కానీ అంతకంటే త్యాగం గొప్పది’అని తనని తాను షర్మిల సర్థించుకుంటున్నారు. అలానే ఇన్నాళ్లు ఊరించి.. హ్యాండిచ్చినందుకు తనను క్షమించమని కూడా పార్టీ కార్యకర్తలను ఓమాట అడిగేశారు. నిజానికి పోలింగ్‌కి ముందు కాంగ్రెస్ పార్టీకి ఆమె చేస్తున్నది ఇది గొప్ప ఉపకారమే అని చెప్పాలేమో. కానీ ఇక్కడ అర్థంకాని విషయం ఏంటంటే..? దీనివల్ల షర్మిలకి తెలంగాణలో ఒరిగే ప్రయోజనం ఏంటి..?
నిజానికి తెలంగాణలో షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని చెప్పినప్పుడు.. చేస్తే చేయవచ్చు గానీ ఆమె వెళ్లి ఏపీలో రాజకీయం చేసుకోవాలని తెలంగాణ కాంగ్రెసులోనే కొందరు నాయకులు బహిరంగంగా అభ్యంతరాలు చెప్పారు. దాంతో ఆ విలీనం ముచ్చట ఆగిపోయింది. కానీ దీని వెనుక కూడా ఓ వ్యూహం ఉందట. ఒకవేళ షర్మిల పార్టీని విలీనం చేసుంటే.. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వైయస్ఆర్ కూతురును విలీనం చేసుకున్న కాంగ్రెస్‌ను విలన్‌గా చూపిస్తూ కేసీఆర్ చెలరేగిపోయేవారు. దాంతో విలీనం ఆపి.. కేసీఆర్‌ని డైవర్ట్ చేశారు. ఇప్పుడు బలపడుతున్న కాంగ్రెస్‌కి అయాచితంగా మరింత బలాన్ని షర్మిల చేకూర్చింది. రాష్ట్రంలో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆమెకి రాజ్యసభ సభ్యత్వం ఇస్తారా? ఇంకేదైనా మేలు చేస్తారా? అనేది అప్పుడు తేలుతుంది