EVM FACTS | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను జారీ చేసింది. మాక్ పోలింగ్‌తో సాధారణ పోలింగు నిర్వహణ జాప్యం అవుతోందన్న ఫిర్యాదుల నేపథ్యంలో గంటన్నర ముందుగా నిర్వహించాలని సూచించింది. మాక్ పోలింగ్ ప్రక్రియలో భాగంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో కనీసం 50 ఓట్లు వేయాలి. ఏ అభ్యర్థికి ఎన్నెన్ని ఓట్లు వేశారన్నది నమోదు చేయాలి.
అప్పటికప్పుడే ఓట్ల లెక్కింపు, వీవీప్యాట్‌లోని స్లిప్పుల లెక్కింపూ జరిగిపోవాలి. అన్నీ సరిపోయాయా? లేదా? అని నిర్ధరించుకోవాలి. ఒకవేళ వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించిన పక్షంలో ఆ యంత్రాన్ని తొలగించి మరో యంత్రంతో మాక్ పోలింగ్ నిర్వహించాలని తెలిపింది. అలానే ఒక్కో పోలింగ్ బూత్‌లో గరిష్ఠంగా 1,400 మంది ఓటర్లు ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారో తెలుసా? ప్రతి బూత్‌లో బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్… ఈ మూడూ ఒకదానికొకటి అనుసంధానంగా పని చేస్తాయి.
ప్రస్తుతం వినియోగిస్తున్న ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)లకు అనుసంధానంగా ఉండే వీవీ ప్యాట్ (ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ అండ్ ట్రయల్)లో థర్మల్ కాగితం పొందుపరుస్తారు. అది 1,450 స్లిప్పుల (చీటీల)ను మాత్రమే ముద్రిస్తుంది. 22.5 ఓల్ట్‌ల బ్యాటరీతో పని చేసే వీవీ ప్యాట్లోని డిస్ప్లేలో ఓటు ఎవరికి వేశామనేది కనిపిస్తుంది. అందులో 50 వరకు కాగితం స్లిప్పులు ఓటింగ్ రోజు మాక్ పోలింగ్ ప్రక్రియకు వాడతారు. అందుకే ప్రతి పోలింగ్ కేంద్రంలో గరిష్ఠంగా 1,400 మంది ఓటర్లు మాత్రమే ఉండేలా చూస్తారు