NALGONDA DISTRICT | పున్నామి నరకం నుంచి రక్షించేవాడు కొడుకు అని అంటారు. కానీ.. వృద్ధాప్యంలో ఆసరాగా నిలవాల్సిన ఓ కొడుకు తన కన్నతల్లిని అమానవీయంగా రాష్ట్ర సరిహద్దులు దాటించి శ్మశానంలో వదిలేశాడు.. స్థానిక గ్రామ సర్పంచి, పోలీసులు చొరవచూపడంతో ఎట్టకేలకు ఆ వృద్ధురాలు ఇంటికి చేరింది. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం వాటర్ ట్యాంకు తండాలో వెలుగు చూసింది.
గ్రామ సర్పంచి ధనావత్ రాంచంద్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. దాచేపల్లి మండలం ఎర్రావులపాడు గ్రామానికి చెందిన 70 ఏళ్ల చింతకాని వెంకటరత్నమ్మకు భర్త ఏడుకొండలు, కుమారుడు వెంకటేశ్, కుమార్తె ఉన్నారు. వృద్ధాప్యంలో ఉన్న ఆమెను కుమారుడు వృద్ధాశ్రమంలో చేర్పించాడు. అక్కడ ఉండలేక తరచూ వెంకటరత్నమ్మ ఇంటికి వస్తున్నారు. మూడు రోజుల క్రితం తల్లితో గొడవపడిన కుమారుడు ఆమెను ఆటోలో ఎక్కించుకుని రాష్ట్ర సరిహద్దు దాటి మిర్యాలగూడ మండలంలో రైల్వేపట్టాల పక్కనే ఉన్న వాటర్ ట్యాంకు తండా శ్మశాన వాటిక సమీపంలో వదిలి వెళ్లాడు. దాంతో ఎక్కడ ఉండాలో తెలియని వృద్ధురాలు శ్మశానవాటికలో తలదాచుకున్నారు.
శ్మశానవాటికకు వెళ్లిన గ్రామ పంచాయతీ సిబ్బంది రవి అక్కడ ఎండలో ఉన్న వృద్ధురాలిని గుర్తించి సర్పంచికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఆయన బాధితురాలికి అల్పాహారం, నీరు ఇచ్చి గ్రామీణ పోలీసులకు సమాచారం అందించారు. వారు వృద్ధురాలిని మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గ్రామీణ ఎస్సై డి.నర్సింహులు చొరవ తీసుకుని ఆమె కుమారుడిని మిర్యాలగూడకు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రాంతీయ ఆసుపత్రిలో ఉన్న తల్లిని కుమారుడికి అప్పగించారు. ఎన్బీఆర్ ఫౌండేషన్ వారు బాధితురాలికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించి, అంబులెన్స్ సమకూర్చి సొంత గ్రామానికి పంపించారు.