CONGRESS | తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రతి ఒక్క నాయకుడు తాము సీఎం అభ్యర్థి అనుకుంటున్నారు. ఈ దఫా ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందో, లేదో తెలియదు కానీ సీఎం సీటుపై మాత్రం ఇప్పటికే
అందరిలో ఆశలు పెరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాను ఎప్పటికైనా సీఎం అవుతానని, కాపాడుకోవాలని కాంగ్రెస్ శ్రేణుల్ని అభ్యర్థించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలోకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చేరారు.
నల్గొండ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. సీఎం సీటుపై తన కన్ను ఉన్నట్లు చెప్పకనే చెప్పారు. నల్గొండ నుంచి సీఎం అవుతారని జోస్యం చెప్పారు. పదేళ్లకైనా తాను సీఎం అవుతానని ఆయన ప్రకటన చేశారు. అయితే ఇప్పటికిప్పుడే సీఎం కావాలనే ఆత్రుత తనకు లేదన్నారు. గతంలో మాయ మాటలు చెప్పి బీఆర్ఎస్ గెలిచిందన్నారు.
కోమటిరెడ్డి సీఎం ప్రకటనతో కాంగ్రెస్ నేతల కామెంట్స్‌ను ప్రత్యర్థులు ట్రోల్ చేస్తున్నారు. ఆలు లేదు, చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అనే చందంగా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే, ముఖ్యమంత్రి పదవిపై నాయకులు కలలు కంటున్నారని ప్రత్యర్థులు సెటైర్లు వేస్తున్నారు