KERALA | తమ వర్గానికి చెందని యువకుడితో ప్రేమలో పడిందని తన కుమార్తెను తీవ్రంగా కొట్టి, బలవంతంగా పురుగుల మందు తాగించి ఆమె మరణానికి కారణమయ్యాడో తండ్రి. కేరళలోని ఎర్నాకుళం ఈ దారుణం చోటు చేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం..బాధిత బాలిక (14) తను చదువుతున్న పాఠశాలలోని మరో వర్గానికి చెందిన బాలుడి(16)తో ప్రేమలో పడింది. దీంతో ఆమె వద్దనున్న సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న బాలిక తండ్రి ఆ బాలుడితో మాట్లాడరాదంటూ హెచ్చరించాడు.
తండ్రి హెచ్చరించినప్పటికీ ఆ బాలిక అతడితో సంభాషిస్తున్నట్లు తెలుసుకున్న ఆ తండ్రి అక్టోబరు 29న ఆమెను ఓ రాడ్‌తో తీవ్రంగా దండించాడు. అంతే కాకుండా పురుగుమందు సీసాను ఆమె ముందు పెట్టి నువ్వు తాగుతావా? లేక నన్ను తాగమంటావా? అంటూ బెదిరించాడు.
చివరకు పురుగు మందును నేనే తాగుతాను అని చెప్పి ఆమె తాగేసింది. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా అక్కడ ఆ బాలిక మృతి చెందింది. దీంతో బాలిక తండ్రిపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు.