ANANTHAPUR | దేశంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మాయమాటలతో సామాన్యులనే కాకుండా సమాజంలో హోదా కల్గిన అధికారులను, వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని మోసగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ పేరుతో కొందరు మోసగాళ్లు వన్‌టౌన్ సీఐ రెడ్డెప్పకు ఫోన్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈనెల 7న రాత్రి 7 గంటల సమయంలో సీఐకి 81486 82305, 69007 35548 ఫోన్ నంబర్ల నుంచి పలుమార్లు వాట్సప్ కాల్, సందేశాలు వచ్చాయి. ‘తాను ఎస్పీ అన్బురాజన్‌ను మాట్లాడుతున్నానని, తనకు అత్యవసరంగా కొంత నగదు కావాలని తొందరగా పంపాలని.. గంటలోపు తిరిగి వెనక్కు పంపిస్తానని.. తాను ఒక ఫోన్‌పే నంబర్ పంపుతానని ఆ నంబర్‌కు డబ్బు పంపాలని’ చెప్పి ఫోన్ పెట్టేశారు. గంటలో డబ్బు ఇస్తానని చెప్పడం.. తన రెస్పాన్స్ వినకుండానే పెట్టేయడంతో సీఐకి అనుమానం వచ్చింది.
అప్రమత్తమైన సీఐ ఇది నేరగాళ్ల పనేనని విచారణలో గుర్తించారు. జిల్లా అధికారి పేరు, హోదాను దుర్వినియోగపరిచేలా కొందరు ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఇలాంటి నకిలీ కాల్స్, మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. గతంలోనూ ఇలాంటి తరహా మోసాలకి పోలీసులు బలయ్యారు