BANDI SANJAY | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర సన్నివేశాలు, ఇంట్రెస్టింగ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆ క్రమంలోనే.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫన్నీ కామెంట్స్ చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో బీజేపీ అభ్యర్థి రమేష్ రాథోడ్ నిర్వహించిన ప్రచార సభలో పాల్గొన్న బండి సంజయ్‌కు.. కార్యకర్తల నుంచి విశేష స్పందన లభించింది. సభలో మాట్లాటేందుకు బండి సంజయ్ రాగా.. ఆయనను చూసి సభలో పాల్గొన్న కార్యకర్తలు, అభిమానులంతా.. సీఎం, సీఎం అంటూ నినాదాలు చేయటం మొదలుపెట్టారు. ఆ నినాదాలతో బండి సంజయ్ ముఖంలో చిరునవ్వు విరబూసింది. దాంతో ఇంకా గట్టిగా అరిచారు కార్యకర్తలు. దీంతో.. ఇక చాలు ఆపాలన్నట్టుగా సైగ చేశారు బండి సంజయ్.
ఆ తర్వాత బండి సంజయ్ మాట్లాడుతూ “మీరు సీఎం సీఎం అంటే ఉన్న పోస్ట్ కూడా గతంలో పీకేశిండ్రు” అంటూ డైలాగ్ వేశారు. నిజానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా సంజయ్ ఉన్న సమయంలో పార్టీ పరుగులు పెట్టింది. కానీ ఆయనను తప్పించాక ఆ జోష్ కాస్త చల్లబడింది. అయితే.. సీఎం పోస్టు కోసం పోటీలో ఉన్న బీసీలు బండి సంజయ్, ఈటల రాజేందర్.. కాగా పార్టీ సీనియార్టీ పరంగా చూస్తే బండి సంజయ్, రాజకీయ అనుభవం పరంగా చూస్తే ఈటల రాజేందర్‌కు ఛాన్స్ ఉంది.
తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడేంత మెజార్టీని బీజేపీ కూడబెట్టగలదా అన్నది ఇప్పుడు ప్రధాన అంశం. ఆలూ లేదూ సూలూ లేదు అల్లుని పేరు సోమలింగం అన్నట్టుగా.. ఇప్పుడే ఈ ముచ్చట్లేంది అంటూ మూతులు తిప్పుకుంటున్నారు కొందరు నేతలు.