VIJAYAWADA | ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల రోడ్లపై ఎమ్మెల్యే, ఎంపీ స్టిక్కర్లతో కార్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిజానికి అందులో ప్రజా ప్రతినిధి ఎవరూ ఉండరు.. కేవలం యువకులు మాత్రమే ఉంటారు. అయినా.. పోలీసులు వాటిని ఆపి తనిఖీ చేసే సాహసం చేయరు. ఇదే అదనుగా కొంతమంది నకిలీ స్టిక్కర్లు తయారు చేయిస్తున్నారు. వాటి సాయంతో దర్జాగా వెళ్లిపోతున్నారు. ఇటీవల విజయవాడలోని భవానీపురం స్టేషన్ పరిధిలో ఈ తరహా ముఠాను పోలీసులు గుర్తించారు.
భవానీపురం స్టేషన్ పరిధిలోని చైతన్య అనే యువకుడు చంద్రగిరి శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేరుతో స్టిక్కర్‌ను తయారు చేసి విక్రయించాడు. అలాగే విజయవాడ తూర్పు శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్, మరికొంతమంది ప్రజాప్రతినిధుల పేరుతోను స్టిక్కర్లు రూపొందించి పలువురికి అమ్మాడు. ఇటీవల తిరుపతిలో నకిలీ స్టిక్కర్ అంటించిన కారును పోలీసులు గమనించి చెవిరెడ్డిని ఆరా తీశారు. ఆ వాహనం తనది కాదని ఆయన తెలిపారు. దీంతో పోలీసులు విచారణ చేయగా విజయవాడకు చెందిన చైతన్య తయారు చేస్తున్నట్లు తేలింది. దీంతో తిరుపతి పోలీసులు నగరానికి వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
రాష్ట్రంలో 175 మంది శాసనసభ్యుడు, 25 ఎంపీ మంది ఎంపీలు ఉన్నారు. వారిలో ఎవరి స్టిక్కరైనా సరే ముఠా సభ్యులు నిమిషాల్లో తయారు చేసి ఇస్తారు. అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధుల పేర్లతో కూడా ఇస్తారు. ఇటీవల కాలంలో విజయవాడ నగరంలో రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంపీల స్టిక్లర్లు వాహనాలకు అంటించి వెళ్తున్నారు. పోలీసులు పట్టించుకోకపోవటంతో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రజాప్రతినిధుల అనుచరులు, బంధువులు, ఇలా…అనేక మంది వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఒక్కో స్టిక్కర్‌ను రూ.2 వేలను నుంచి రూ.10 వేల వరకు విక్రయిస్తున్నారు. దందాలు, సెటిల్మెంట్లు చేసే ముఠాలు ఎక్కువగా ఈ నకిలీ స్టిక్కర్లను ఉపయోగిస్తున్నారు. తమ వెనుక ఫలానా ప్రజాప్రతినిధి ఉన్నారని, మీ అంతు చూస్తామంటూ బెదిరించేందుకు ఎక్కువగా వినియోగిస్తున్నారు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.