KHAMMAM DISTRICT | బంధాలన్నీ.. ఆర్థిక సంబంధాలే అని పెద్దలు ఊరికే అన్నారా..? కూతురికి ప్రేమానురాగాలు పంచాల్సిన తండ్రి.. తన కొడుకులతో కలిసి కూతురుని దారుణంగా చంపేశాడు. అది కూడా పెళ్లయిన పదేళ్ల తర్వాత గర్భం దాల్చిన ఆ ఆడబిడ్డను కర్కశంగా కడతేర్చారు. కుటుంబపరమైన ఆస్తి తగాదాల్లో ఏకంగా కొడవళ్లు, గొడ్డలితో వేటాడుతూ దారుణానికి ఒడిగట్టారు. అత్యంత అమానవీయమైన ఈ ఘటన ఖమ్మం జిల్లా వైరా మండలం తాటిపూడి గ్రామంలో చోటుచేసుకుంది.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం… తాటిపూడికి చెందిన పిట్టల రాములు, మంగమ్మ దంపతులకు కుమారులు నరేశ్, సురేశ్, వెంకటేశ్‌తోపాటు కుమార్తె ఉషశ్రీ ఉంది. చిన్ననాటి నుంచి తాతయ్య మన్యం వెంకయ్య మనవరాలు ఉషశ్రీని పెంచిపెద్ద చేశారు. పదేళ్ల క్రితం పరిసబోయిన రామకృష్ణతో పెళ్లి చేశారు. ఆమె ఆలనాపాలనా చూసిన తాతయ్య వెంకయ్య పెళ్లి సమయంలో మనవరాలు ఉషశ్రీకి వ్యవసాయ పొలంతోపాటు గ్రామంలోని ఇల్లు, స్థలం ఇచ్చారు. వీరు కూడా తాటిపూడిలోనే ఉంటున్నారు. కొన్నేళ్ల క్రితం వెంకయ్య మృతి చెందారు. వెంకయ్యకు మంగమ్మ ఒక్కరే కుమార్తె.
మనవరాలికి వెంకయ్య ఎక్కువ ఆస్తి ఇచ్చారంటూ ఉషశ్రీ, రామకృష్ణలపై ఆమె పుట్టింటి వారు అక్కసు పెంచుకున్నారు. ఉషశ్రీ దంపతులపై ఆమె తండ్రి, సోదరులు కోర్టుకు వెళ్లారు. ఆస్తి తమకే దక్కాలంటూ ఇరువర్గాలు కొన్నేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నాయి. దీనిపై గ్రామంలో పంచాయితీలు, ఘర్షణలు జరిగాయి. కేసులు కూడా నమోదయ్యాయి. ఇదిలా ఉండగా ఉషశ్రీ, రామకృష్ణలకు చెందిన ఇంటి ఆవరణలో సుబాబుల్ చెట్లున్నాయి. వీటిని నరికే విషయంలో ఉషశ్రీ దంపతులకు, పుట్టింటి వారికి మధ్య శుక్రవారం వాగ్వాదం చోటుచేసుకుంది. సుబాబుల్ ఉన్న భూమి మాదంటే మాదంటూ ఇరువర్గాలు వాదనకు దిగాయి. ఇద్దరి ఇళ్లూ దగ్గరదగ్గరే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గొడవ పెద్దది కావడంతో పిట్టల రాములు, నరేశ్, వెంకటేశ్‌లు తమ వెంట తెచ్చుకున్న కొడవళ్లు, గొడ్డలి, పారతో పాటు రాళ్లు విసురుతూ ఉషశ్రీ దంపతులపై దాడి చేశారు.
భయంతో రామకృష్ణ, ఉషశ్రీ చెరోవైపు పరుగులు తీశారు. ముందుగా వారు రామకృష్ణపై విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆయన కుప్పకూలిపోయాడు. ఉషశ్రీ రోడ్డు దాటి ఓ బజారులో పరుగులు తీస్తుండగానే వెంట పడిన తండ్రి, సోదరులు దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలు అయిదు నెలల గర్భిణి అని స్థానికులు తెలిపారు. అల్లుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో పిట్టల రాములు, వెంకటేశ్లకూ గాయాలయ్యాయి. ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.