TELANGANA CONGRESS | తెలంగాణ కాంగ్రెస్ మునుపటి కంటే పుంజుకుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ.. ఆ పార్టీ నుంచి రోజుకో కొత్త సీఎం అభ్యర్థి పుట్టుకొస్తున్నారు. దీంతో ప్రతిపక్షాలకు ఈ వ్యవహారం కామెడీగా మారిపోయింది. కాంగ్రెస్‌ని విమర్శించే క్రమంలో ఆ పార్టీలో సీఎం అభ్యర్థుల గురించి కూడా చెణుకులు విసురుతున్నారు వైరి వర్గం నేతలు.
కాంగ్రెస్ సీఎం రేసు నవ్వులపాలు కావడంతో సీనియర్ నేత వి.హనుమంతరావు ఈ సీఎం గోలపై స్పందించారు. ఠాక్రే సమక్షంలోనే పంచాయితీ పెట్టారు. సీఎం గోల ఆపమని చెప్పాలంటూ ఆయన తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రేకి సూచించారు. “కాంగ్రెస్‌లో ఎవరికి వారు నేనే సీఎం అంటున్నారు. కాంగ్రెస్ నేతలు నేనే సీఎం అనడం మానేయాలి. ఠాక్రేజీ..! నేతలందరికీ ఈ సీఎం గోల ఆపమని చెప్పండి. కాంగ్రెస్‌లో సీఎంను అధిష్ఠానం నిర్ణయిస్తుంది. నాకు కూడా గతంలో సీఎం అవకాశం వచ్చిపోయింది. ముందు ఎన్నికల్లో గెలవండి.. తర్వాత సీఎం పంచాయితీ.” అని చెప్పారు వీహెచ్.
చివరిగా ఆయన చెప్పిన మాటే హైలైట్ అవుతోంది. గతంలో తనకు కూడా ఆ అవకాశం వచ్చిపోయిందని ఆయన అన్నారు. అంటే సీఎం రేసులో తానుకూడా ఉన్నానని పరోక్షంగా వీహెచ్ ప్రస్తావించారనే అనుకోవాలి. బీజేపీ బీసీ సీఎం అంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బీసీ నేతల్లో సీనియర్ గా తనకు ఆ అవకాశం ఎందుకు రాకూడదు అనుకున్నారో ఏమో.. గతంలో తనకు సీఎం సీటు అవకాశం వచ్చి పోయిందని చెప్పుకొచ్చారు వీహెచ్.