JANASENA IN TELANGANA | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న జనసేనకు కొత్త సమస్య వచ్చింది. ఈ ఎన్నికల్లో జాతీయ జనసేన పేరుతో మరో పార్టీ కూడా బరిలో ఉండటం ఆ పార్టీకి ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. జాతీయ జనసేన పార్టీ గుర్తు సైతం జనసేన గాజు గ్లాసును పోలిన బకెట్ గుర్తు ఉండటం ఎక్కువ టెన్షన్ పెడుతోంది. ఓవరాల్‌గా పేరు, గుర్తు దాదాపు ఒకే రకంగా ఉండటంతో కొన్ని చోట్ల ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశాలున్నాయని జనసేన నేతలు కంగారుపడుతున్నారు.
కానీ.. ఒక్కటే ఊరట ఏంటంటే జాతీయ జనసేన కేవలం కూకట్పల్లి స్థానంలో మాత్రమే పోటీ చేస్తోంది. ఇక్కడ సెటిలర్లు ఎక్కువగా ఉండటంతో ఈ స్థానంపై జనసేన ఆశలు పెట్టుకుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. జనసేన కచ్చితంగా గెలిచే అవకాశాలున్న స్థానం కూకట్పల్లి మాత్రమే. దాంతో అక్కడే జాతీయ జనసేన రూపంలో ఆ పార్టీకి షాక్ తగిలినట్లయింది.
జాతీయ జనసేన పోటీ వెనుక బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ ఉన్నాయని జనసేన నేతలు అనుమానిస్తున్నారు. పొత్తులో భాగంగా బీజేపీ 111 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. జనసేనకు 8 స్థానాలు కేటాయించింది. కూకట్పల్లి, తాండూరు, కోదాడ, నాగర్‌కర్నూలు, ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వారావు పేట స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీలో ఉన్నారు.