KADIRI | తనభార్యతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఓ వ్యక్తి కుమ్మరవాండ్లపల్లికి చెందిన వలీఖాన్పై కత్తితో దాడిచేసి గాయపరిచాడు. బాధితుడు కదిరి గ్రామీణ పోలీసులకు తెలిపిన వివరాలు. వలీఖాన్ భార్య ఆయిషా కుమ్మరవాండ్లపల్లి గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తున్నారు. ఆమె తనభర్త ఫోన్ నంబరునే సచివాలయ సిబ్బందికి ఇచ్చారు.
ఇంటి పన్ను కట్టే విషయమై కుమ్మరవాండ్లపల్లికి చెందిన ఓ మహిళ వాలంటీరుకు ఫోన్‌చేశారు. ఆ ఫోన్‌కు ఆమె భర్త సమాధానం ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మహిళ భర్త.. తనభార్యకు ఎందుకు ఫోన్ చేశావంటూ వలీఖాన్తో వాగ్వాదానికి దిగారు. ఇంటిపన్ను కట్టే విషయాన్ని వాలంటీరైన తన భార్యకు చెప్పాలనే ఉద్దేశంతో ఆమె ఫోన్ చేశారని చెప్పినా ఆయన అనుమానం నివృత్తి కాలేదు.
ఇదే విషయమై పలుమార్లు గొడవపడ్డారు. శనివారం మరోసారి వలీఖాన్తో గొడవకు దిగి కత్తితో దాడిచేసి గాయపరిచాడు. బాధితుడిని స్థానికులు కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వలీఖాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని కదిరి గ్రామీణ పోలీసులు తెలిపారు.