TELANGANA | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంటోంది. ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో అన్ని రకాల రాజకీయ ప్రకటనలను నిలిపివేస్తూ సీఈవో ఆదేశాలు జారీ చేసింది. ఇకనుంచి పొలిటికల్ యాడ్స్ నిలిపివేయాలని మీడియాను ఈసీ ఆదేశించింది. అన్ని చానళ్లు, సోషల్ మీడియా ఛానళ్లకు తెలంగాణ చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ లేఖలు రాశారు. ఇప్పటికే అన్ని రాజకీయా పార్టీలు, లీడర్లు ఈసీ రూల్స్ బ్రేక్ చేస్తూ తమకు కావాల్సినట్లు ప్రకటనలు తయారుచేసి ప్రచారం చేసుకుంటున్నారని ఈసీ గుర్తించింది.
అసెంబ్లీ సాధారణ ఎన్నికల కోసం స్టేట్ లెవెల్ సర్టిఫికేషన్ కమిటీ ఆమోదించిన రాజకీయ ప్రకటనలు దుర్వినియోగం అవుతున్నాయని సీఈవో అభిప్రాయపడింది. రాజకీయ పార్టీల నేతలు, అభ్యర్థులు తమ ఇష్టానుసారంగా మార్చి ప్రసారం చేస్తూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘిస్తున్నట్లు నిర్ధారించింది. ఈ కారణంగా పొలిటికల్ యాడ్స్‌ను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ఓ లేఖలో పేర్కొంది. ఆ మేరకు మీడియా సంస్థలకు ఎన్నికల ప్రధానాధికారి లేఖ రాశారు. తక్షణమే పొలిటికల్ ప్రకటనల ప్రసారాలను నిలిపివేయాలని ఛానళ్లకు సూచించారు. ఆ ప్రకటనలకు సంబంధించిన కొన్ని వీడియోలు, క్లిప్ లను కూడా సీఈఓ కార్యాలయం జతపరిచింది.
బీఆర్ఎస్తో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ డిజిటల్ ప్రచారంలో ముందు ఉంది. ప్రకటనలను కూడా చాలా క్రియేటివ్ గా రూపొందించింది. కేసీఆర్ పాలనపై పూర్తిస్థాయి సెటైర్లతో వీడియోలు రూపొందించారు. కేసీఆర్ లాగే ఉన్న ఓ వ్యక్తిని పెట్టి షూట్ చేశారు. ఇవి వైరల్ అయ్యాయి. వీటన్నింటినీ ఈసీ ఆపేసినట్లయింది. బీఆర్ఎస్ పార్టీ.. బలగం నటులతో ప్రకటనలు రూపొందించుకుంది. వాటిని ఇప్పుడు ప్రసారం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంది.. వాటికి ఈ ఉత్తర్వులు వర్తిస్తాయా లేదా అన్నది ఇక తేలాల్సి ఉంది