VIJAYAWADA | విజయవాడ రామవరప్పాడుకు చెందిన ఓ మహిళకు పదేళ్ల నుంచి పాస్‌పోర్టు ఉంది. చిరునామా మార్చి రెన్యువల్ చేసుకునేందుకు గత నెలలో విజయవాడలోని పాస్‌పోర్టు కేంద్రంలో దరఖాస్తు చేశారు. అంతా రెడీ అయిన తర్వాత పోస్టులో ఇంటికి పంపిస్తామని అధికారులు చెప్పారు. తర్వాత కొన్ని రోజులకు పోస్టల్ శాఖ నుంచి ఆమెకు ఎస్ఎంఎస్ వచ్చింది. రిజిస్టర్డ్ పోస్టులో కవర్ డిస్పాచ్ అయిందని అందులో ఉంది. మూడు రోజులు చూసినా కవర్ రాలేదు. దీంతో ఆమె ఆన్‌లైన్‌లోకి వెళ్లి పోస్టల్ శాఖను సంప్రదించేందుకు నంబరు కోసం వెతికారు. అందులో కనిపించిన ఓ సైట్లో తన సమస్యను నమోదు చేశారు. ఈ నెల 3న ఓ నంబరు నుంచి కాల్ వచ్చింది. మీ చిరునామా సరిగా లేదని, మార్చాల్సి ఉందన్నాడు. అందుకే రిజిస్టర్డ్ పోస్టు ఆలస్యమవుతోందని నమ్మించాడు.
మీ సమస్య పరిష్కారం కావాలంటే పోస్టల్ శాఖకు రూ.5 యూపీఐ ద్వారా చెల్లించాలని ఫోన్ చేసిన వ్యక్తి సూచించాడు. దీని కోసం ఓ లింక్ పంపిస్తున్నట్లు చెప్పి దానిని 15 సెకన్లలో ఓ నంబరుకు పంపించమని చెప్పాడు. ఆ వ్యక్తి పంపించిన లింక్‌ను చెప్పిన సమయంలోగా పంపించేందుకు 14 సార్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరకు 15వ సారి పంపించగలిగింది. తర్వాత యూపీఐ ద్వారా రూ.5 చెల్లించింది. మరుసటి రోజే ఆమెకు పోస్టులో పాస్‌పోర్టు వచ్చింది. రూ.5 చెల్లించడం వల్లే వచ్చిందని ఆమె భావించారు. కానీ.. ఆ తర్వాత ఎస్బీఐ నుంచి ఆ మహిళకు కాల్ వచ్చింది. మీ బ్యాంకు ఖాతా నుంచి రూ.లక్ష బదిలీ అయ్యాయి. మీరే చేశారా? అని ప్రశ్నించారు. తాను చేయలేదని ఆమె సమాధానం ఇచ్చింది.
తీరా బ్యాంకు స్టేట్మెంట్ను పరిశీలిస్తే.. తన ఖాతా నుంచి రూ.లక్ష డెబిట్ అయినట్లు చూసి నిర్ఘాంతపోయింది. వెంటనే సైబర్ క్రైమ్ సహాయవాణి నంబరుకు ఫోన్ చేసి ఖాతాను బ్లాక్ చేసి పోలీసులను ఆశ్రయించింది.