TELANGANA ELECTIONS | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగియగా.. నామినేషన్ల పరిశీలన కూడా సోమవారం పూర్తయ్యింది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4,798 మంది నామినేషన్లు వేయగా.. ఇందులో 608 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరణకి గురైనట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో మాజీ మంత్రులు, సీనియర్ నేతలు కూడా ఉండటం గమనార్హం. నాగార్జునసాగర్‌లో మాజీ మంత్రి కె.జానారెడ్డి, హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ భార్య జమున, కోరుట్లలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్ నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
నాగార్జునసాగర్‌లో జానారెడ్డి కుమారుడు జయవీర్ రెడ్డి కాంగ్రెస్ తరపున బరిలో ఉన్నారు. ఇక హుజూరాబాద్‌లో బీజేపీ తరపున ఈటల రాజేందర్, కోరుట్లలో విద్యాసాగర్ రావు కుమారుడు సంజయ్ బీఆర్ఎస్ తరపున బరిలోకి దిగుతున్నారు. అయితే ముందు జాగ్రత్తగా వీరు డమ్మీ నామినేషన్లు దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది.
ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సమర్పించిన అఫిడవిట్ నిబంధనల మేరకు లేదంటూ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన అభ్యంతరాలను కూడా అధికారులు తిరస్కరించారు. పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి యశస్వినికి మూడు వేర్వేరు అడ్రస్‌లు ఉన్నాయంటూ బీఆర్ఎస్ ప్రతినిధులు అభ్యంతరం తెలిపారు. నిబంధనల మేరకు అలా అడ్రస్‌లు ఉండవచ్చంటూ అభ్యంతరాలను అధికారులు తోసిపుచ్చారు.