TELANGANA | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ సమీపిస్తున్నకొద్దీ రాజకీయ పార్టీలు వాడీవేడిగా విమర్శలు చేసుకుంటున్నాయి. నిజానికి ఎన్నికల బరిలో చాలా పార్టీలే ఉన్నా ప్రధాన పోరు మాత్రం అధికార బీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ మధ్యే అని తెలుస్తోంది. అలానే సర్వే సంస్థలకు కూడా ప్రజల నాడి ఏంటనేది చిక్కడం లేదు.
అసెంబ్లీ ఎన్నికలపై డెమోక్రసీ టైమ్స్ నెట్ వర్క్ అనే సంస్ధ నిర్వహించిన తాజా సర్వేలో రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత హోరాహోరీ పోరు నెలకొందో స్పష్టమైంది. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య సాధించే సీట్ల తేడా కూడా అత్యంత స్వల్పంగా ఉండటంతోపాటు హోరాహోరీ పోరు నెలకొన్న స్ధానాల విషయంలోనూ ఈ సర్వే చాలా మేరకు క్లారిటీ ఇచ్చేసింది.
డెమోక్రసీ టైమ్స్ నెట్ వర్క్ సర్వేలో ఈసారి తెలంగాణలోని 119 అసెంబ్లీ సీట్లలో అధికార బీఆర్ఎస్ అత్యధికంగా 45 సీట్లలో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తుండగా.. విపక్ష కాంగ్రెస్ కూడా 42 సీట్లలో ఆధిక్యం ప్రదర్శించబోతున్నట్లు తేలిపోయింది. ఇక బీజేపీ కేవలం 4 సీట్లలోనూ, ఎంఐఎం ఆరు సీట్లలోనూ ఆధిక్యంలో ఉన్నట్లు తాజా సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇవన్నీ ఓ ఎత్తయితే మిగిలిన 22 సీట్లలో అత్యంత తీవ్రమైన పోటీ నెలకొన్నట్లు ఈ సర్వే తెలిపింది. ఈ సీట్లలో మెజారిటీ ఎవరు సాధిస్తే వారిదే అధికారమని డెమోక్రసీ టైమ్స్ నెట్వర్క్ సర్వే స్పష్టం చేసింది.