RTC BUS | బస్సులో బంగారం చోరీకి గురై మహిళలు ఆందోళన పడుతుండగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేయడంలో చిత్తూరు ఒకటో పట్టణ, జీడీ నెల్లూరు ఠాణాల పోలీసులు ఆలసత్వం వహించి.. బాధితులను మరింత ఇబ్బందికి గురి చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బాధితుల కథనం మేరకు.. శ్రీరంగరాజపురానికి చెందిన అకాచెల్లెళ్లు రమ, అనసూయ 40 సవర్ల బంగారు నగలతో బెంగళూరు వెళ్లేందుకు కర్ణాటక RTC BUS ఎక్కగా.. కొంత సేపటికే గుర్తు తెలియని వ్యక్తులు బ్యాగులో ఉన్న బంగారు నగలు చోరీ చేశారు. చిత్తూరులో ఈ విషయాన్ని గుర్తించిన బాధితులు హడావుడిగా బస్సు దిగి ఒకటో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. నగర శివారులోని చెక్‌పోస్టు వద్ద చోరీ విషయాన్ని గుర్తించినట్లు బాధితులు తెలపడంతో ఘటన గంగాధర నెల్లూరు ఠాణా పరిధిలో జరిగి ఉంటుందని అక్కడి వెళ్లాలని చెప్పారు.
బాధితులు ఉరుకులు పరుగుల మీద అక్కడి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బస్సు ఎక్కిన చోటే (శ్రీరంగరాజపురం)లో చోరీ జరిగి ఉంటుందని అక్కడికి వెళ్లాలని ఉచిత సలహా ఇచ్చారు. అక్కడి వెళ్లగా వారి నుంచి దాటవేత ధోరణిలో సమాధానం వినిపించింది. చేసేది ఆ మహిళలు అక్కడి నుంచి వెనుదిరిగారు. తెలిసిన వారిని తీసుకుని ఉన్నతాధికారులను ఆశ్రయించారు. వారి ఆదేశాలతో శ్రీరంగరాజపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.