DELHI | వైద్యం తెలియకపోయినా.. డాక్టర్లుగా చెలామణి అవుతూ సర్జరీలు చేస్తున్న డాక్టర్లన్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా వాళ్లు చేసిన ఆపరేషన్ల జాబితా చూసిన పోలీసులు అవాక్కయ్యారు. ఇప్పుడు దేశ రాజధానిలో నకిలీ వైద్యుల సర్జరీల వ్యవహారం కలకలం రేపుతోంది. వారి వద్ద చికిత్స తీసుకున్న ఇద్దరు రోగులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఈ కేసుకు సంబంధించి DELHI పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు.
గ్రేటర్ కైలాస్ ప్రాంతంలో నీరజ్ అగర్వాల్ అనే వైద్యుడు అగర్వాల్ మెడికల్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. తనకున్న మెడికల్ అనుభవంతో జస్ప్రీత్ సింగ్ అనే వైద్యుడితో కలిసి ఎలాంటి వైద్య అర్హతలు లేని తన భార్య పూజ, మాజీ ల్యాబ్ టెక్నీషియన్ మహేందర్ సింగ్‌ల సహకారంతో నీరజ్ అక్రమంగా సర్జరీలు నిర్వహిస్తున్నట్లు తేలింది.
ఎంతలా అంటే.. పిత్తాశయంలో రాళ్ల తొలగింపుతోపాటు సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన అతి సున్నితమైన సర్జరీలను ఎక్కువగా వీళ్లు చేసేవారు. అగర్వాల్ క్లినిక్‌లో సర్జరీలు చేయించుకున్న ఇద్దరు రోగులు ఇటీవల ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ ముఠా బాగోతం బయటపెట్టారు. ఈ వ్యవహారంలో మరికొందరి భాగస్వామ్యం కూడా ఉండొచ్చని, ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.