KADAPA | పొలం అమ్మగా వచ్చిన డబ్బుని ఆ రైతు బ్యాంక్లో భద్రంగా డిపాజిట్ చేశాడు. అతనికి కనీసం ఏటీఎం కూడా లేదు. కానీ.. కేటుగాళ్లు ఆన్లైన్ ద్వారా ఆ డబ్బుని ఓటీపీ సాయంతో మాయం చేసేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
యూనియన్ బ్యాంకు చాపాడు శాఖలో అదే గ్రామానికి చెందిన ఉప్పలూరు చిన్ననరసింహులు తన అకౌంట్లో రూ.11.24 లక్షలు మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నరసింహులు ఆగస్టులో తన సొంత పొలం అమ్మితే వచ్చిన మొత్తాన్ని బ్యాంకులో భద్రపరచుకున్నారు. తిరిగి ఆ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసేందుకు బ్యాంకుకు వెళ్లగా విషయం బయటపడింది.
గత మూడు నెలలుగా ఆన్లైన్ ద్వారా డబ్బు టాన్స్ఫర్ జరిగినట్లు బ్యాంకు వారు తెలిపారని బాధితుడు వాపోయారు. తనకు ఏటీఎం కార్డు కూడా లేదని, ఎలా మాయమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ విషయమై బ్యాంకు మేనేజరు రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ ఆన్లైన్ ఓటీపీలతో లావాదేవీలు జరిగాయన్నారు. మొత్తం సొమ్ము ఎస్బీఐ ఖాతాకు వెళ్లినట్లు గుర్తించామన్నారు. వెంటనే రికవరీ చేయించి ఖాతాదారుడికి అందేలా చూస్తామని మేనేజరు వివరించారు.