REVANTH REDDY | తెలంగాణలో ఎన్నికల వేడి మరింత రాజుకుంటోంది. పోలింగ్ తేదీకి సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని వేడెక్కిస్తున్నాయి. రాజకీయ విమర్శలతో నాయకులు మంచి కాక మీద ఉన్నారు. తెలంగాణలో ప్రధాన పోటీ అధికార బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యే ఉంది. అయితే బీజేపీ కూడా తామే అధికారంలోకి వస్తామని కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నప్పటికీ గ్రౌండ్ రియాల్టీ మాత్రం అందుకు భిన్నంగా ఉంది.
బీజేపీ – జనసేన ద్వయం మూడో స్థానానికే పరిమితమవుతాయంటూ సర్వేలు ఘోషిస్తున్నాయి. రెండు సార్లు బీఆర్ఎస్కు పట్టం కట్టిన ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నట్లు సమాచారం. ప్రత్యామ్నాయ పార్టీ అయిన కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.ఇక అందరికీ తెలిసిన విషయమే కాంగ్రెస్‌లో అంతర్గత స్వేచ్ఛ ఎక్కువని. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యమని భావిస్తున్న కొందరు నేతలు ఎవరికి వారే కాబోయే సీఎం తామేనని బాహాటంగానే ప్రకటనలు చేస్తున్నారు.
ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి ఇదే ప్రశ్న ఎదురైంది. పార్టీ తరఫున పోటీచేస్తున్న అభ్యర్థులందరూ సీఎం అభ్యర్థులే అనుకుని కష్టపడాలని, ప్రజలు వారిని గెలిపించాలని చమత్కరించారు. అయితే, సీఎం కావాలన్న బలమైన కోరిక రేవంత్రెడ్డిలోనూ ఉందనేది ఓపెన్ సీక్రెట్. ఒకవేళ రేవంత్ రెడ్డే సీఎం అభ్యర్థి అని అనుకుంటే.. కాంగ్రెస్ పార్టీలోనే రాజకీయాలు ప్రారంభించి.. సుదీర్ఘకాలంగా పార్టీలో కొనసాగిన మా పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించే నేతలూ లేకపోలేదు. అదే సమయంలో రేవంత్ రెడ్డి కాకుండా సీనియర్లలో ఎవరికి ఆ పదవి ఇచ్చినా తమకు ఓకే అని ఆ నాయకులు చెబుతున్న పరిస్థితి ఉంది.