GOOTY | గుత్తిలో ఓ ఆగంతకుడు మహిళ ఏటీఎం కార్డును మార్చి రూ.25వేలు నగదును డ్రా చేసేశాడు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న మహిళ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. పట్టణానికి చెందిన ఎస్తేర్‌రాణి ఏటీఎంలో నగదు తీసుకునేందుకు అనంతపురం రోడ్డులోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు వద్దకు వెళ్లింది.
ఏటీఎంలో నగదు తీసుకునే విధానం తెలియకపోవడంతో ఆమె తెలిసిన వారికి వీడియో కాల్ చేసింది. చరవాణిలో చూస్తూ నగదు ఉపసంహరణకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఇది గమనించిన గుర్తుతెలియని వ్యక్తి ఆమె ఏటీఎం కార్డును తీసుకుని తన వద్ద ఉన్న నకిలీ కార్డుతో నగదు ఉపసంహరణకు యత్నించాడు. నగదు రాకపోవడంతో ఆమెకు నకిలీ కార్డును ఇచ్చి డబ్బు రావడం లేదని చెప్పి అసలు కార్డుతో ఉడాయించాడు.
ఆ తర్వాత కాసేపటికే మరో ఏటీఎంకు వెళ్లి రూ.10వేలు రెండుసార్లు, రూ.5వేలు ఒకసారి డ్రా చేసుకున్నాడు. ఏటీఎం నుంచి బయటికి వచ్చిన కొంతసేపటి తర్వాత మహిళ ఫోన్‌కి డబ్బు డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.