HYDERABAD | క్షణికావేశంలో దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో పాటు 4 ఏళ్ల బిడ్డని కూడా తమతో తీసుకెళ్లారు. కారణం తెలిసి అందరూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎన్నో ఆశలతో పదేళ్ల క్రితం ఒక్కటైన ఆ జంట.. ఆరేళ్ల తరువాత పుట్టిన ఆడపిల్లతో అన్యోన్యంగా సాగుతున్న సంసారంలో ఒక్కసారిగా అనుకోని కష్టం ఎదురైంది. కన్నబిడ్డకు ఉరివేసి భార్యాభర్తలు ప్రాణాలు తీసుకున్నారు. ముషీరాబాద్ గంగపుత్రకాలనీలో ఉదయం ఈ దారుణం చోటుచేసుకుంది.
సాయికృష్ణ(37), చిత్రకళ(30) దంపతులు, కూతురు తేజస్విని(4) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏడాదికాలంగా ఉద్యోగం వదిలేసి ఇంటికే పరిమితమైన భర్త, పనిచేసే చోట ఎదురైన అవమాన భారంతో భార్య క్షణికావేశంలో కఠిన నిర్ణయం తీసుకొని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన సాయికృష్ణ, విజయవాడకు చెందిన చిత్రకళకు పదేళ్ల క్రితం పెళ్లయింది. ఆరేళ్ల తరువాత పుట్టిన చిన్నారి తేజస్వినిని అల్లారుముద్దుగా చూసుకునేవారు. ఏడాది క్రితం ముషీరాబాద్‌లోని గంగపుత్రకాలనీలో అద్దెకు దిగారు. ఆర్నెల్ల క్రితం అక్కడే మరో ఇంటికి మారారు. ఆరేడేళ్ల నుంచి బీఎం బిర్లా సైన్స్ సెంటర్లో చిత్రకళ ఉద్యోగం చేస్తున్నారు. ఏడాదిగా భర్త ఖాళీగా ఉండటం, దురలవాట్ల కారణంగా ఆలుమగల మధ్య గొడవలు తలెత్తేవి. నెల క్రితం అవినీతి ఆరోపణలతో చిత్రకళను అధికారులు మందలించటంతో విధులకు గైర్హాజరవుతున్నారు.
ఇటీవలే ఉద్యోగంలో చేరమని అధికారులు సూచించినా ఇంటికే పరిమితమయ్యారు. రాత్రి వారున్న పోర్షన్ నుంచి పెద్దగా టీవీ సౌండ్ రావటంతో పక్కింటి వారు తలుపు కొట్టినా స్పందన లేకపోయింది. ఉదయం టీవీ శబ్దాలు పెద్దగా వస్తుండటంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారమిచ్చారు. వారాసిగూడ ఇన్స్పెక్టర్ శంకర్, ఎస్సై సుధాకర్ బృందం తలుపులు పగలగొట్టి చూడగా ముగ్గురూ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు గుర్తించారు. ఏపీలోని కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. క్లూస్ బృందాలు సంఘటనాస్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించాయి.
పెళ్లయిన చాన్నాళ్లకు పుట్టిన బిడ్డ కావటంతో అపురూపంగా చూసుకునేవారని స్థానికులు తెలిపారు. తాము లేకపోతే చిన్నారి అనాథగా మారుతుందనుకున్నారేమో.. ముందుగా ఆ చిట్టితల్లికి ఉరేసి చనిపోయిందని నిర్ధారించుకున్నాక దంపతులు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. భార్యాభర్తలిద్దరి తల్లిదండ్రులు గతంలోనే మరణించారు.