LOVERS SUICIDE | గూడూరు రైల్వే జంక్షన్ పరిధి తిరుపతి-గూడూరు రైలు మార్గంలో యువతీ యువకులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. గూడూరు జీఆర్పీ ఎస్సై కొండపనాయుడు కథనం మేరకు.. గూడూరు-కొండాగుంట రైల్వేస్టేషన్ల మధ్య తిరుపతి మార్గంలో దిగువ రైలు పట్టాలపై ఇద్దరు మృతి చెంది ఉండడాన్ని రైల్వే సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వారు వచ్చి మృతదేహాలను పరిశీలించారు. మృతుల వద్ద లభించిన ఆధారాలను బట్టి పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలం సాగిపాడుకు చెందిన దండే రాకేష్(23), పల్నాడు జిల్లా మాచవరం మండలం రుక్మిణిపురానికి చెందిన అన్నంగి పావని(19)గా గుర్తించినట్లు తెలిపారు. గూడూరు సమీపంలోని టిడ్కో భవన సముదాయం వెనుక వైపు ఉన్న రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు.
ఆత్మహత్యకు పూర్తి కారణాలు తెలియరాలేదు. మృతుల బంధువులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతులు ప్రేమ జంటగా భావిస్తున్నామని.. ఇంట్లో పెళ్లికి పెద్దలు ఒప్పుకోరనే భయంతో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.